హైదరాబాద్ వాసులకు అలర్ట్.. సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు ఈ దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. వినాయక చవితి నేపథ్యంలో ఖైరతాబాద్ లోని బడా గణేష్ దర్శనం కోసం అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వారు మరో మార్గాలను చూసుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ 14 తేది నుంచి 23 వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు ఈసారి 30 లక్షల మంది దాకా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రద్దీని నివారించేందుకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్ టీసీ బస్సులను వినియోగించుకోవాలని పోలీసులు కోరారు.
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ నగర జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయల్ డెవిస్ తెలిపారు. అలాగే ఖైరతాబాద్ మార్గంలో ఆర్ టీసీ సంస్థ నిత్యం వందల సంఖ్యల బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోందని అన్నారు. అలాగే మధ్యాహ్నం తర్వాత వీకెండ్స్ లో (శని, ఆదివారాలు) వీటితోపాటు సెలవు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి.. సాయంత్రం రద్దీని నివారించడానికి భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపలే దర్శనం పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వీకెండ్స్ లో కాకుండా సోమవారం నుండి శుక్రవారం మధ్య రోజులలో దర్శనానికి రావడం బెటర్ అని తెలిపారు. దర్షనం కోసం వచ్చే భక్తులకోసం ఐమ్యాక్స్, హెచ్ఎండీఏ స్థలం, ఎన్టీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించామని వివరించారు. అలాగే వీఐపీల కోసం ప్రత్యేక రూట్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. బడా గణేష్ ట్రాఫిక్ అరెంజ్ మెంట్ కోసం దాదాపు 500 మంది ట్రాఫిక్ సిబ్బంది పనిచేయనున్నట్లు వివరించారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
