విపక్షాలపై నిందలు సరే: మిర్చి రైతుల సమస్య లేదా, కెసిఆర్‌కు పట్టదా?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/ఖమ్మం: ఆరుగాలం కష్టపడి సాగుచేసి, అష్టకష్టాలు పడితేనే మిర్చి తోట నుంచి మిర్చి ఇంటికి రాదు. అనునిత్యం కష్టాలతో పండించిన మిర్చిని మార్కెట్‌కు తరలిస్తే.. వ్యాపారులు సిండికేట్‌గా మారి తాము తగ్గించిన ధరకు విక్రయిస్తే కొంటామనడం ఆందోళనకు నేపథ్యం. వ్యాపారులు దానికి నాణ్యత సాకు చూపడం మరీ వింతగా కనిపిస్తున్నది.

సిండికేట్ వ్యాపారుల ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్నదాత ఆందోళన బాట పట్టడం.. ఆగ్రహం వ్యక్తం చేయడం అనూహ్య పరిణామమేం కాదు. ఇంతకుముందు వరంగల్, హైదరాబాద్‌లోని మలక్ పేట మండీ వద్ద రైతులు ఆందోళనకు దిగిన ఘటనలు ఇంకా కనుమరుగు కాలేదు.

రైతులు పండించిన పంటలకు, తగిన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు చెప్తుంటారు.

మంత్రి హరీశ్ ఆన్ లైన్ నిఘా ఏమైంది?

మంత్రి హరీశ్ ఆన్ లైన్ నిఘా ఏమైంది?

ఎప్పటికప్పుడు పర్యవేక్షణలతో ప్రతి సీజన్ ప్రారంభానికి ముందే ఏ పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందో అంచనాలు వేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్న మంత్రి హరీశ్‌రావు గత ఏడాదికాలంగా రాష్ట్రంలోని మార్కెట్ల పరిస్థితిని నేరుగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిర్చి కొనుగోళ్లలో అవకతవకలకు చోటు లేకుండా మంత్రి హరీశ్ రావు పెషీలో ప్రత్యేకంగా లైవ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రత్యేక సిబ్బందిని నియమించి ఆయా మార్కెట్ల పరిధిలో ఏం జరుగుతున్నదన్న విషయమై సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుసుకుంటూ ఆదేశాలిస్తున్నారని వార్తలు ఉన్నాయి. అటువంటప్పుడు ఖమ్మం జిల్లా కేంద్ర మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాలు మంత్రి హరీశ్ రావు ద్రుష్టికి రాలేదా? ధర దారుణంగా రూ.15 వేల నుంచి రూ.3000లకు పడిపోతుంటే మార్కెటింగ్ శాఖ మంత్రి, జిల్లా మంత్రి చోద్యం చూస్తున్నారా? అని విమర్శకులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.

కేంద్రం సాకుతో తప్పించుకుంటున్న అంతర్గత సంక్షోభం

కేంద్రం సాకుతో తప్పించుకుంటున్న అంతర్గత సంక్షోభం

మార్కెటింగ్ శాఖ పనితీరుపై నిత్యం సమీక్షలు జరిపై మంత్రి హరీశ్ రావు ఈ విషయంలో ఎందుకు ఊరకుండి పోయారన్న విషయమై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రైతులను ఆదుకునేందుకు సానుకూల చర్యలు ఎందుకు తీసుకోలేదన్న అభిప్రాయాలు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇంకా కేంద్రం నుంచి స్పందన రాలేదు. కానీ ఇక్కడ అర్థం గానీ ప్రశ్నేమిటంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, వ్యాపారులతో సంప్రదింపులు జరుపాల్సిన ప్రభుత్వం తమ చేతుల్లో ఏమీ లేదని కేంద్రానిదే బాధ్యత అని తప్పించుకోజూడటం ఏలిన వారికి న్యాయమేనా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ మాటకొస్తే నిరుడు ఉల్లిగడ్డ రైతు నష్ట పోకుండా కిలో 8 చొప్పున రైతు బజార్లు, మార్కెట్లు, ప్రత్యేక కేంద్రాల వద్ద రాష్ట్ర మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేసిందన్న సంగతి విస్మరించింది. ఉల్లిగడ్డలు నాఫెడ్ పరిధిలో ఉంటాయి. నాఫెడ్ పరిధిలో లావాదేవీలన్నింటికీ కేంద్రానిదే బాధ్యత అన్న సంగతి విస్మరించి కేంద్రంపై నెపం మోపి, రైతును కడగళ్ల పాల్జేయడం ‘రైతు పక్షపాతి'నని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వానికి పాటి అవుతుందా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

విపక్షం, మీడియాపై విమర్శలతో చేతులు దులిపేస్తారా?

విపక్షం, మీడియాపై విమర్శలతో చేతులు దులిపేస్తారా?

పొరుగు తెలుగు రాష్ట్ర ప్రభుత్వం గత పది రోజులుగా జరుగుతున్న కొనుగోళ్లలో క్వింటాల్ పై రూ.1500 రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సంగతిని కూడా విస్మరించి.. వ్యాపారుల ఇష్టానికి వదిలేసీ తాము చేయాల్సిందంతా చేస్తున్నామని ప్రచారార్భాటానికి దిగితే రైతు సమస్యలు పరిష్కారమవుతాయా? అని ప్రశ్నిస్తున్నారు. గుండెలు మండిన రైతులు ఆందోళనకు దిగితే మద్దతునివ్వడం ప్రతిపక్షాల విద్యుక్త ధర్మం. ప్రజల కీలక సమస్యలను సమాజానికి తెలియజేయడం మీడియా బాధ్యతల్లో ప్రధానమైంది. వాటి వీక్షకులను పెంచుకోవడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాయి. కానీ అధికార టీఆర్ఎస్, దాని సారథ్యంలోని మీడియా సంస్థలకు ఇది విపక్షాల కుట్ర కనిపించడం విడ్డూరంగా కనిపిస్తున్నది.

రైతుల ఆందోళనకు మద్దతు తెలుపొద్దా

రైతుల ఆందోళనకు మద్దతు తెలుపొద్దా

విపక్షాల బాధ్యతలు విస్మరించాలా రైతుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవడానికి బదులు ఆందోళనకారులకు మద్దతు తెలిపిన వారిపై బట్ట కాల్చి మీద వేయడం అధికార పార్టీ వారికే చెల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియాలో వచ్చిన వార్తలపై ఇతర పక్షాలు.. ప్రస్తుతం టీఆర్ఎస్ ద్రుష్టిలో కనుమరుగైన తెలంగాణ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతుందని విపక్షాలు అంచనా వేశాయని మరో అభాండం వేశారు. ఆందోళనకారులు నిజంగా సంఘ వ్యతిరేక శక్తులైతే కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే.

విపక్షాలు కుట్ర పన్నాయన్న సర్కార్

విపక్షాలు కుట్ర పన్నాయన్న సర్కార్

సరిహద్దుల్లో ఉన్న కశ్మీర్‌లోనే విద్యార్థులు ప్రత్యేకించి బాలికలు తమ ముఖాలకు ముసుగులు ధరించి భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతుంటే.. సద్దుమణిగేలా చర్యలు చేపట్టలేక మెహబూబా ముఫ్తీ సర్కార్ అష్టకష్టాల పాలవుతున్నది. కానీ ఖమ్మం మార్కెట్ యార్డులో విధ్వంసానికి పాల్పడిన వారు కేసుల భయంతో ముఖానికి ముసుగులు (హ్యాండ్ కర్చీఫ్)లు ధరిస్తే మాత్రం విపక్షాలు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలకు దిగడం ప్రభుత్వానికి చెల్లుబాటు కాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వినతి పత్రాలతో పరిష్కారం వుతుందా?

వినతి పత్రాలతో పరిష్కారం వుతుందా?

అన్యాయంగా ధర తగ్గించారని రైతులు ఆందోళనకు దిగితేనే గానీ పట్టించుకోని పాలకులు.. వినతిపత్రాలిస్తే పరిష్కారం చేసేస్తామన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చి వెళ్లిన తర్వాతే విధ్వంసం జరిగిందని జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలో ఉన్నదని మరో వాదన. ప్రభుత్వాధికారిగా ఏలినవారి మనస్సు తెలిసి మసులుకోవడమే సబబుగా ఉంటుందని ఇటీవలి పరిణామాలు చెప్తున్నాయి. యథావిధిగా క్రయ, విక్రయాలు జరుగుతున్నాయని ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ క్రుష్ణ పేర్కొనడమే విచిత్రంగా ఉన్నది. 13 వేల నుంచి 15 వేల వరకు ధర పలికి మిర్చి ఎకాఏకీన రూ.3000కు తగ్గిస్తే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారన్న సందేహం కలుగుతున్నది.

మార్కెట్ కమిటీ జోక్యం చేసుకోక పోవడానికి కారణాలేమిటి

మార్కెట్ కమిటీ జోక్యం చేసుకోక పోవడానికి కారణాలేమిటి

సమస్య పరిష్కారంలో మార్కెట్ విఫలంఅన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేసే వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ క్రుష్ణ ఎందుకు జోక్యం చేసుకోలేదన్న విషయం చెప్పకుండా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆరోపించడం ఫక్తు రాజకీయమే తప్ప, సమస్య పరిష్కారానికి అనుసరిస్తున్న కోణంగా మాత్రం కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. కుట్ర కోణం ఉన్నదని వాదిస్తున్న టీఆర్ఎస్.. అదే సమయంలో మోత్కూరులో మార్కెట్ యార్డును సందర్శించిన జేఏసీ చైర్మన్ కోదండరాంను అడ్డుకునేందుకు విఫలయత్నం చేయడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను తెలియజేస్తున్నది.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనే లక్ష ఎకరాల్లో సాగు

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనే లక్ష ఎకరాల్లో సాగు

అసలు వాస్తవ పరిస్థితి ఏమిటంటే తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్లలో రెండో స్థానంలో ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలతోపాటు ఏపీ నుంచి పంట తరలిస్తారు. ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లోనే సుమారు లక్ష ఎకరాల్లో మిరప సాగైంది. ఏపీలోని కృష్ణా జిల్లా గంపలగూడెం, నూజివీడు, నందిగామ, వత్సవాయి, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి ఇక్కడికి మిర్చి వస్తోంది. సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల రైతులు భారీగా ఖమ్మం మార్కెట్‌కు తమ పంటను తీసుకొస్తున్నారు.

రూ.13,500 నుంచి నేల చూపులే

రూ.13,500 నుంచి నేల చూపులే

గతేడాది మిరప క్వింటాకు రూ.11,500 నుంచి రూ.13,500 వరకు పలికింది. ఈ ఏడాది జనవరిలో క్వింటా రూ.12,500 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. ఫిబ్రవరి నుంచి ధరలు తగ్గడం ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 15నాటికి క్వింటా ధర రూ.7,500కు పడిపోయింది. క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ జెండాపాట ఒకధర ఉంటే క్షేత్రస్థాయిలో ధర మరోరకంగా మారింది. ఉదాహరణకు జెండాపాట రూ.5,500గా నిర్ణయిస్తే ఆ ధరకు 10శాతం మాత్రమే కొంటున్నారు. మిగతా 90శాతం సరకు నాణ్యత లేదంటూ ధరను అమాంతం తగ్గిస్తున్నారు.

రూ.3000లకు క్వింటాల్ కొంటామన్న వ్యాపారులు

రూ.3000లకు క్వింటాల్ కొంటామన్న వ్యాపారులు

శని, ఆదివారాలు సెలవు కావడంతో శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన మిరపను క్వింటా రూ.2,500 చొప్పున అమ్మితే కొంటామని వ్యాపారులు చెప్పడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. క్వింటా మిరప ఏరివేతకే కూలీలకు రూ.2,500 అవుతుందని, రవాణా ఛార్జీలు, మార్కెట్‌లో బస సమయం ఖర్చులతో క్వింటాకు రూ.3000 అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క అధికారులు సీజన్‌ ప్రారంభం నుంచి 32 లక్షల క్వింటాళ్ల మిర్చిని కొన్నామంటున్నా, కూలి డబ్బులు కూడా రాకుంటే ఎలా అని రైతులు ఆవేదన చెందుతున్నారు.

అధికారుల దన్నుతో వ్యాపారుల ఇష్టారాజ్యం ఇలా

అధికారుల దన్నుతో వ్యాపారుల ఇష్టారాజ్యం ఇలా

కొందరు వ్యాపారుల గుప్పిట్లో ఖమ్మం మార్కెట్‌ నడుస్తోంది. కొందరు అధికారులు సహకరిస్తుండటంతో వారిదే ఇష్టారాజ్యమైంది. వాస్తవానికి ఖమ్మం మిరప మార్కెట్‌కు ఎక్కువ సంఖ్యలో మిర్చి దిగుమతి అవుతోంది. నెలరోజులుగా రోజుకు సుమారు 80వేల నుంచి లక్ష బస్తాల వరకు సరకు వస్తోంది. ఈ బస్తాలతో మార్కెట్‌ నిండిపోవడంతో అపరాలు, పత్తి మార్కెట్లకు కొన్ని బస్తాలను తరలించారు. అక్కడా నిండిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా రైతులు బస్తాలను ఉంచారు. వచ్చిన సరకు కొనుగోలు చేయకపోవడం, వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధర తగ్గించడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mirchi farmers angered on business people because down fall the mirchi rate rs 13,500 to rs.3000 while they are gone marketyard dismental the furniture.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి