ఖమ్మం కార్పోరేషన్ లో కారు జోరు ... 30 డివిజన్ల కౌంటింగ్ పూర్తి, కౌంటింగ్ లేటెస్ట్ అప్డేట్ ఇదే !!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రేటర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభం కాగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు కౌంటింగ్ అధికారులు. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించిన వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. ఇక కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధించారు. కరోనా నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video

ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూకుడు
బ్యాలెట్ల లెక్కింపుతో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అందుకే ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో కారు రయ్యిన దూసుకుపోతుంది . ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశలో ఉంది . మొత్తం 60 డివిజన్ల ఖమ్మం కార్పొరేషన్లో పదవ డివిజన్ టిఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవం కావటంతో 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి . కౌంటింగ్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దూకుడు చూపించారు.

ఇప్పటివరకు 30 డివిజన్ల ఫలితాలు వెల్లడి
అందులోటిఆర్ఎస్ , సిపిఐ కూటమి 21 స్థానాలు
ఖమ్మం కార్పొరేషన్ కు సంబంధించి ఇప్పటివరకు 30 డివిజన్ల లెక్కింపు పూర్తికాగా టిఆర్ఎస్ , సిపిఐ కూటమి 21 స్థానాలు ,అందులో టీఆర్ఎస్ పార్టీకి 19 స్థానాలు రాగా, సిపిఐ రెండు స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్, సిపిఎం కూటమి ఏడు స్థానాలలో విజయంసాధించాయి. కాంగ్రెస్ 6 స్థానాల్లోనూ ,సీపీఎం ఒక స్థానంలోనూ జండా ఎగరేసింది. బిజెపి ఒక స్థానంలో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

మిగతా డివిజన్లలోనూ అధికంగా ఆధిక్యత టీఆర్ఎస్ అభ్యర్ధులదే
మిగిలిన డివిజన్లలోనూ అధిక శాతం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ముందు వరుసలో ఉన్నారు. తాజా కౌంటింగ్ సరళిని బట్టి ఖమ్మం కార్పొరేషన్లో కూడా టిఆర్ఎస్ హవా కొనసాగుతుందని, ఖమ్మం కార్పొరేషన్ దక్కించుకునేది టిఆర్ఎస్ పార్టీ నేనని అర్థమవుతుంది. కాకుంటే ఖమ్మంలో బీజేపీ తో పోల్చుకుంటే, కాంగ్రెస్ పార్టీ పలు స్థానాలలో గట్టిపోటీ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల , కొత్తూరు , అచ్చంపేట , సిద్ధిపేట , నకిరేకల్ లలో దూసుకుపోయింది. ఇక గ్రేటర్ వరంగల్ లోనూ ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది.












Click it and Unblock the Notifications