కేసీఆర్ దిల్లీలో ఏం చేస్తున్నారు -గ్రాఫిక్స్‌తో మభ్య పెడుతూ : కిషన్ రెడ్డి..!!
వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. సీఎం కేసీఆర్ నాలుగు రోజులుగా ఢిల్లీలో ఏం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మూసీ పరివాహకంలోని ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ముసారంబాగ్ బ్రిడ్జిని పరిశీలించిన ఆయన..వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే.. ప్రగతిభవన్ దాటి బయటికి రాని కేసీఆర్.. ఇప్పుడు దిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీసారు.
మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రాఫిక్స్‌తో మభ్యపెట్టిందని విమర్శించారు. విపత్తు వేళ ఉపయోగించుకునేందుకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ.. రాష్ట్ర సర్కార్ విఫలమైందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా మూసీని ఆక్రమిస్తున్నందునే ఏటా పేదల ఇళ్లు మునుగుతున్నాయని ఆరోపించారు. కొంత మంది మూసీ నది ఆక్రమించుకొని పేదలకు రెంట్ కు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.

మూసీ ప్రాంతమంతా బడుగు బలహీనర్గాలు ఉండే ప్రాంతమన్నారు. సీఎం గతంలో వరదలు వచ్చినప్పుడు ప్రగతి భవన్ నుంచి బయటికీ వచ్చి ప్రజలను పరామర్శించలేదని విమర్శించారు. కేంద్రం పైన కేసీఆర్ చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ పాలనకు కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉందని..ఉన్నన్ని రోజులు మంచి పనులు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications