మీ ఖాతాలో వేసుకోండి: కెసిఆర్ ప్రభుత్వంపై కోదండ ఆగ్రహం, పాలమూరుపై బిజెపి
హైదరాబాద్/మహబూబ్ నగర్: తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శుక్రవారం నాడు తప్పు బట్టారు. రైతు రుణాలను ఇంకా వారి ఖాతాలలోనే ఎందుకు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట రుణాలను ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవాలన్నారు.
పాలమూరు ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు: రామచంద్ర రావు
పాలమూరు ఎత్తిపోతల పథకానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ శాసన మండలి సభ్యుడు ఎన్ రామచంద్ర రావు శుక్రవారం చెప్పారు. రైతులకు వంద శాతం రుణమాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆయన జిల్లాలోని నారాయణపేటలో నియోజకవర్గ బిజెపి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పాలమూరు వలసలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆత్మహత్యలపై ప్రభుత్వంలో చలనం లేదు
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రైతుల కుటుంబాలను పరామర్శించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలకు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు. రైతు అప్పుల ఖాతాను ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవాలన్నారు. రైతాంగ సమస్యల పైన ఈ నెల 26న హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తామన్నారు.
నాగం వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివి: లక్ష్మా రెడ్డి
బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. అధికారపక్షంపై విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలన్నారు.
రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదని, గత ప్రభుత్వాలే కారణమన్నారు. కేసీఆర్ చేపట్టిన చైనా పర్యటనపై విపక్షాలు అనవసరంగా ఆందోళన చేస్తున్నాయన్నారు. త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications