నిర్వాసితుల కోసం కోదండరాం యుద్దం!: 'ప్రాజెక్టులపై పోరుకు ఎంతకైనా సిద్దం'
ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులవుతున్న వారి విషయంలో ఎంతకైనా పోరాడడానికి సిద్దమంటున్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం .
హైదరాబాద్ : తెలంగాణలో బలమైన ప్రతిపక్షం పాత్రను పోషిస్తున్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. ముఖ్యంగా ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులవుతున్న వారి విషయంలో ఎంతకైనా పోరాడడానికి సిద్దమంటున్నారు. ప్రభుత్వంపై పోరు కోసం నిర్వాసితులను సన్నద్దం చేసి ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టబోతున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తేదీలు ఖరారు కాగానే ధర్నా తేదీని ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు.
హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం నాడు టీజేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్టుల నిర్వాసితుల సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు కోదండరాం. ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలను బెదిరించి భూములు లాక్కోవడం చెల్లుబాటు కాదన్న విషయం గుర్తెరగాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను మాత్రం తప్పకుండా వ్యతిరేకిస్తామని కోదండరాం తేల్చి చెప్పారు.
ప్రాజెక్టుల కోసం ఎంతోమంది తమ భూములను ప్రభుత్వాలకు త్యాగం చేసి నిర్వాసితులవుతున్నారని, బ్రతుకుదెరువును నాశనం చేసి వారి సమాధులపై ప్రాజెక్టులు నిర్మిస్తారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్వాసితులను ప్రభుత్వం గౌరవించాలని, వారి గోడును అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం వారితో చర్చలు జరపాలని కోదండరాం డిమాండ్ చేశారు.
ప్రతీ మనిషికి తనవైన హక్కులుంటాయని, ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ఉంటుందని ఈ సందర్బంగా కోదండరాం వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూముల నిర్వాసితులు మననుషులు కాకుండా పోతారా? అని ప్రశ్నించారు. టీజేఏసీ చేపట్టబోయే ధర్నా కోసం ప్రతీ నిర్వాసితుడి ఇంటి నుంచి ధర్నాకు తరలిరావాలని కోదండరాం పిలుపునిచ్చారు. డిసెంబర్ 15న కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించి కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాలని నిర్వాసితులకు సూచించారు.

సదస్సులో ఆమోదించిన తీర్మానాలు:
డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్-సమగ్ర నివేదిక)ను ప్రకటించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలి.
భూసేకరణ చట్టం-2013 ప్రకారమే భూసేకరణ ప్రక్రియ జరగాలి. దీని ప్రకారమే నష్ట పరిహారం, పునరావాస చర్యలను తీసుకోవాలి.
వ్యవసాయం, చేతి వృత్తులు, రైతు కూలీలు, కులవృత్తులపై ఆధారపడ్డ వారికి పునరావాసంతో పాటు శాశ్వత ఉపాధి కల్పించాలి.
ప్రాజెక్టుల కోసం నిర్వాసితులవుతున్న వారికి.. వాటి లాభాల్లో వాటాను అందించాలి.
భూమికి-భూమి ప్రాతిపదికన సాగుభూములను అదే ప్రాజెక్టు కింద ప్రభుత్వమే సేకరించి నిర్వాసితులకు అందజేయాలి.
పట్టా రైతులు, అసైన్డ భూములు, సాదా బైనామా భూములు, ఇనాం భూములు, చెరువు శిఖం, గ్రామకంఠం, తదితర పేర్లతో నిమిత్తం లేకుండా ఒకే రకమైన భూమి విలువను నిర్వాసితులందరికీ చెల్లించాలి.












Click it and Unblock the Notifications