వేములవాడ రాజన్న కోడెల మరణమృదంగం.. అసలు కారణం చెప్పిన కలెక్టర్!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజే శ్వరస్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో తరచూ కోడెలు మృత్యువాత పడటం ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేసింది. కేవలం రెండు రోజులు వివిధ లోనే 14 కోడెల మృతి చెందాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిన్న ఎనిమిది కోడెలు వివిధ కారణాలతో మృతి చెందాయి.ఈనెల 28 న మూడు కోడెలు మృతి చెందాయి.
వేములవాడ రాజన్న ఆలయ కోడెల మరణ మృదంగం
మృతి చెందిన కోడెలను గోశాల సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి మూలవాగులో పూడ్చి వేశారు. రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు మొక్కు ల రూపంలో స్వామివారికి సమర్పించే కోడెలను ఆలయ అధికారులు తిప్పాపూర్ గోశాలలోనే సంరక్షిస్తుంటారు.కోడెల మొక్కుల ద్వారా ఆలయానికి రూ కోట్ల ఆదాయం సమకురుతున్నప్పటికీ వాటి సంరక్షణ పై నిర్లక్ష్యం వహిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కోడెల మృతిపై స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్
ఇదిలా ఉంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలలో కోడెలు మరణించడం బాధాకరమని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాలను విస్తరించాలని ఈవోకు సూచించానని తెలిపారు. రాజన్న ఆలయం నిధులను మాజీ సీఎం కేసీఆర్ ఇతర అవసరాలకు వాడారని ఆరోపించారు. కొడెలని రక్షించాల్సిన బాధ్యత దేవస్థానం బోర్డుపైనే ఉందన్నారు. అందుకు సరైనా ప్రణాళికలు రూపొందించాలని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
గోశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలలోని కోడెల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆలయ అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కోడెల మృతి నేపథ్యంలో వేములవాడ తిప్పాపూర్ లోని గోశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోవులకు అందిస్తున్న మేత, ఇతర పదార్థాల నాణ్యత, పరిసరాలను పరిశీలించారు.
కోడెల మృతిపై కలెక్టర్ క్లారిటీ
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ అకాల వర్షాలు, అనారోగ్య కారణాలతో 8 కోడెలు మృతి చెందాయని తెలిపారు. మిగతా ఏ కోడెలు మృతి చెందలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అనవసరపు అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు. పశు వైద్యాధికారులు అంజిరెడ్డి, రాహుల్, అభిలాష్, సాహితి, దీప్తి ఆద్వర్యంలో కోడెలకు నిరంతరం వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
కోడెల సంరక్షణపై కీలక సూచనలు
కోడెల సంరక్షణను మరింత బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. నిత్యం వాటికి అందించే దాణా, మేత విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. నిత్యం పచ్చి గడ్డి పెట్టాలని, గోశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. త్వరలో కోడెల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications