రేవంత్ సర్కార్ పై సంచలన ఆరోపణలు
Komatireddy Rajgopal Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి, అసహనం క్రమంగా తలెత్తుతున్నట్టే కనిపిస్తోంది. నల్లగొండ జిల్లా మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనికి కేంద్ర బిందువు అవుతున్నారు. గతంలో సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు మరోసారి వాటిని పునరావృతం చేశారు. తన ఉద్దేశం ఏమిటో చాటిచెప్పారు.
తాజాగా రీజినల్ రింగ్ రోడ్- సౌత్ కింద మునుగోడు నియోజకవర్గంలో ఉద్దేశపూరకంగా అలైన్మెంట్ ను తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. దివిస్ కంపెనీకి లబ్ది చేకూర్చాడానికే ఇలా అలైన్మెంట్ మార్చారని ధ్వజమెత్తారు. భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వంపై పోరాడతానని ఆయన తేల్చి చెప్పారు. వారికి అన్ని విధాలుగా న్యాయం చేయడానికి తనవంతు చర్యలు తీసుకుంటానని అన్నారు.

ఈ రోడ్ కింద భూములను కోల్పోతున్న రైతులు, ఇతర నిర్వాసితులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం జరిగేలా చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్ఆర్ఆర్- సౌత్ పరిధిలోకి వచ్చే ఇతర నియోజకవర్గాల శాసనసభ్యులతో మాట్లాడుతున్నానని, వారందరినీ కలుపుకొని అలైన్మెంట్ మార్పుపై పోరాడతానని చెప్పారు. ఈ విషయంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఆవేదనతోనే ఉన్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
అధికార పార్టీలో ఉన్నప్పటికీ తాను ప్రజల పక్షానే ఉంటానని, వారి తరఫునే గళమెత్తుతానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవి.. ప్రజలు ఇచ్చిందేనని, వారికి కష్టనష్టాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. అలైన్మెంట్ మార్చడానికి కారణాలను రైతులకు వివరించి ఒప్పించి నిర్ణయం తీసుకోవాలని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. బలవంతగా తీసుకోకూడదని అన్నారు.
ఆర్ఆర్ఆర్- నార్త్ లో అలైన్మెంట్ విషయంలో తప్పు జరిగిందని, అదే తప్పును సౌత్ లో కూడా ఆ తప్పును కొనసాగిస్తోందని కోమటిరెడ్డి విమర్శించారు. రీజినల్ రింగ్ రోడ్ వెళ్లే నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడుతామని ఆయన తెలిపారు. భూమికి రైతుకు మధ్య గల భావోద్వేగాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications