కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారు, కానీ - తేల్చేసిన రాజగోపాల్ రెడ్డి..!!
పార్టీ మార్పు పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ వీడిన వారు తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో తిరిగి కాంగ్రెస్ లో రీ ఎంట్రీ ఇచ్చే అంశం పైన చర్చించినట్లు వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి తన పైన చేసిన ఆరోపణలకు క్షమాపణ చెబితే కాంగ్రెస్ లో చేరే అంశం పైన నిర్ణయం తీసుకుందామని రాజగోపాల్ చెప్పారని ప్రచారం జరిగింది. దీని పైన రాజగోపాల్ తనకు కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారని స్పష్టం చేసారు.
కాంగ్రెస్ లో ఉన్న కొందరు ముఖ్యులు తిరిగి తనను కాంగ్రెస్ లోకి రమ్మని కోరుతున్న మాట నిజమేనని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కానీ, తాను పార్టీ మారే అవకాశం లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో ఏలా గెలుస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిచిన తరువాత సీఎం పదవి కోసం అక్కడి నేతలు పోటీ పడుతున్నారని..తెలంగాణలో అసలు ఎన్నికలే జరగకముందే సీఎంగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేసారు.

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించారని ఫైర్ అయ్యారు. రేవంత్ తో కలిసి పని చేయటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లో నాలుగు గ్రూపులు ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. తాను కేసీఆర్ ను గద్దె దించడానికే బీజేపీలో చేరానని చెప్పారు. కాంట్రాక్ట్ ల కోసం పార్టీ మారేవాడినైతే తనను కేసీఆర్ చాలా సార్లు బీఆర్ఎస్ లోకి రమ్మన్నారని రాజగోపాల్ చెప్పారు.
My political opponents are spreading rumours of me changing party. It's a lie. I'm staying with BJP and contesting from Munugode. They aim to confuse my supporters.
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) May 17, 2023
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే మోడీ, అమిత్ షా నాయకత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. తాను ఎన్నికల్లో ఓడినా...తాను డబ్బులకు అమ్ముడుపోయే మనిషిని కానన్నారు రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం బీజేపీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ తో గంటసేపు మాట్లాడినట్లు చెప్పారు. తాను అందరి సమక్షంలోనే బీజేపీలో చేరిన విషయాన్ని గుర్తు చేసారు.
వచ్చే ఎన్నికల్లోనూ తాను బీజేపీ తరపున మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ట్వీట్ చేసి వెల్లడించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీ కాలం ముగుస్తుందన్నారు. తిరిగి కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవాకాశం ఇస్తారా అనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ను మార్చాలని ఎవరూ లాబీయింగ్ చేయడం లేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications