తిరిగి కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి - రేవంత్ కు షరతు..!?
తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో కొత్త జోష్ తెస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు ఆదరణ లేదని పార్టీ వీడిన నేతలు తిరిగి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ గా మారిన తెలంగాణ పొలిటికల్ గేమ్ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కొత్త కండీషన్లు పెట్టినట్లు సమాచారం.
సొంత గూటికి రాజగోపాల్:తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రత్యేక ఆకర్షణ. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసారు. బీజేపీ లో చేరి మునుగోడు నుంచి పోటీ చేసారు. హోరా హోరీగా సాగిన ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా అంత యాక్టివ్ గా లేరనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి పైన పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. కానీ, ఉప ఎన్నికల ప్రచారానికి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. రేవంత్ పైన ఇద్దరు సోదరులు ఫైర్ అయ్యారు. ఆ తరువాత రాజగోపాల్ రెడ్డి ఓటమి, రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ రావటంతో పరిస్థితుల్లో మార్పు కనిపించింది.

ప్రజలు ఆదరిస్తారా:కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా నల్గొండ అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు తన ముఖ్య అనుచర వర్గంతో చర్చలు చేస్తున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. బీజేపీలోనే కొనసాగాలా.. మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లాలా అన్న విషయమై రాజగోపాల్ మూడు రోజులుగా చర్చలు చేస్తున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లటానికి రాజగోపాల్ రెడ్డికి ఎక్కడా అడ్డంకులు ఉండవు. కానీ, ఝార్ఖండ్‌లో తన కంపెనీకి రూ.18వేల కోట్ల టెండర్ దక్కడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్తే తాను తిరిగి కాంగ్రె్‌సలో చేరే విషయమై ఆలోచిస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం.
రేవంత్ క్షమాపణ చెబితేనే:ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ బీజేపీలో ఆశించిన విధంగా పరిస్థితులు కనిపించటం లేదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల ముఖ్య నేతలెవరూ బీజేపీలో చేరే అవకాశం లేదనే చర్చ వారి మధ్య జరిగినట్లు చెబుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 175 సీట్ల కంటే ఎక్కువ రావని రాజగోపాల్ అభిప్రాయంగా తెలుస్తోంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోనే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, మిగతా చోట్ల అంతగా ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, తిరిగి పార్టీ మారితే నియోజకవర్గంలో ప్రజల్లో వచ్చే స్పందన పైనా చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన పైన చేసిన ఆరోపణలకు రేవంత్ క్షమాపణ చెబితే కాంగ్రెస్ లో చేరిక పైన ఆలోచన చేద్దామనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. మరి..దీనికి రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications