సురేఖ పై చర్యల వేళ ఊహించని మలుపు - తేల్చేసిన కొండా మురళీ..!!
కొండా సురేఖ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటికే క్రమశిక్షణా సంఘం సిఫారసుల మేరకు మంత్రి పదవి పైన వేటు వేసేందుకు కసరత్తు జరుగుతోంది. మంత్రి పదవి నుంచి సురేఖ ను తప్పిస్తారని భావిస్తున్నారు. ఈ సమయంలోనే రాయబారం మొదలైంది. కొండా మురళీ తాజా గా డిప్యూటీ సీఎం భట్టితో సమావేశం అయ్యారు. ఆ తరువాత అసలు విషయం తేల్చి చెప్పేసారు.
కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం భట్టితో కొండా మురళీ సమావేశం అయ్యారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తాను ఎలాంటి చర్చ చేయలేదని కాంగ్రెస్ నేత మురళి స్పష్టం చేశారు. సుస్మితకు స్వతంత్రంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని తెలిపారు. ఆమె వ్యాఖ్యలపై ప్రశ్నించే హక్కు తమకు లేదన్నారు.

సుస్మిత తనకు నచ్చినట్లు తాను ఉంటుందని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని కొండా మురళి పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని అన్నారు. 'మా బిడ్డ చేసిన వ్యాఖ్యలతో మాకేం సంబంధం?' అని వ్యాఖ్యానించారు. కమిటీకి చెప్పాల్సిన విషయాలన్నీ ఇప్పటికే వివరించామని తెలిపారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కొండా మురళి స్పష్టం చేశారు.
కుమార్తె.. రాజకీయం వేర్వేరు అని మురళీ వ్యాఖ్యానించారు. ప్లాన్ ఏ, ప్లాన్ బీతో సుస్మిత ముందుకు వెళ్తారేమో అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్‌రెడ్డి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పరకాల టికెట్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తూ.. తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు.
సుస్మిత వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై చర్యలకు సిద్ధం అయింది. కాగా.. ఇప్పుడు హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో కొండా వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.














Click it and Unblock the Notifications