కొండా సురేఖపై అధిష్టానానికి నివేదికలో కీలక అంశాలివే!
తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ తీరు హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్రవ్యాఖ్యల ఎపిసోడ్ తర్వాత, కుమార్తె చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించకపోవటం, షోకాజ్ నోటీసులకు తనకు, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదని చెప్పటం, ఆపై తనపై కుట్ర జరుగుతోందని లేఖ రాయటం సురేఖను టార్గెట్ చేసేలా చేశాయి.
కొండ సురేఖపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీకి తాజా నివేదిక
దీంతో కొండా సురేఖ వ్యవహారశైలి పై పీసీసీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నారని, వివాదాలను మరింత పెంచే విధంగా ప్రవర్తిస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివారం ఏఐసీసీకి తాజా నివేదిక పంపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన అసత్య ఆరోపణలను సురేఖ ఖండించకపోవటం పార్టీ శ్రేణుల్లో నేతల్లో తీవ్ర ఆగ్రహానికి కారణంగా మారిందని వారు తమ నివేదికలో పేర్కొన్నారు.

పార్టీ నేతలపై అభాండాలు వేయడంపై నివేదికలో ప్రస్తావించిన పీసీసీ
సురేఖ కూతురి వ్యాఖ్యలను సమర్థించడం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసమ్మతి కలిగించింది. ఆ తర్వాత 'తనపై కుట్ర జరుగుతోంది' అని లేఖ రాయడం కూడా పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉందని పేర్కొంది. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత మాట్లాడినా సురేఖ ఖండించకపోగా, పార్టీ నేతలపై అభాండాలు వేయడం సరికాదని పీసీసీ, క్రమశిక్షణ కమిటీ భావిస్తున్నాయి. ఈ విషయాలను అన్నింటినీ వారు కూలంకషంగా ఏఐసీసీ, రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు వివరించారు.
నివేదికల ఆధారంగా ఏఐసీసీ అంతర్గత విచారణ
పీసీసీ నివేదికలు, ఎమ్మెల్యేల మీడియా సమావేశాలు, సురేఖ లేఖలపై ఏఐసీసీ అంతర్గత విచారణ చేస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో చర్చించి వివరాలు అడిగినట్లు సమాచారం. అయితే అందరూ కొండా కుటుంబ వ్యవహార శైలిపై ప్రతికూలంగానే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్టు సమాచారం.
కొండా సురేఖ పైనా, చిన్నారెడ్డిపైనా చర్యలు తీసుకునే అవకాశం
గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేసినందున, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఆమెతో సహకారం సాధ్యం కాదని, అభివృద్ధి పనులకు ఎలా సాయపడతారని ప్రశ్నిస్తున్నారు.ప్రతిపక్షాలకు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు, మంత్రివర్గం నుంచి తొలగించాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని కూడా సూచనలు వస్తున్నాయని వారు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళారు. కొండా సురేఖ పైనా, చిన్నారెడ్డిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని, మంత్రివర్గంలో మార్పులు రావచ్చని చర్చలు సాగుతున్నాయి.













Click it and Unblock the Notifications