ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టుక గురించి ఆయనకే తెలియాలి .. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా గుర్తించబడిన కొండా సురేఖ దంపతులు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న కొండా చిత్రంతో మరోమారు వార్తల్లో నిలిచారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు వరంగల్ వేదికగా కొండా సినిమా షూటింగును ప్రారంభించారు. కొండా మురళి స్వగ్రామమైన వంచనగిరిలో ఈ చిత్ర నిర్మాణాన్ని మొదలు పెట్టిన రామ్ గోపాల్ వర్మకు సాదరంగా స్వాగతం పలికిన కొండా సురేఖ సినిమా పై మాట్లాడారు. కొండా సినిమా నిర్మాణం నేపధ్యంలో కొండా ఫ్యాన్స్ వరంగల్ లో హంగామా చేస్తున్నారు. ఈ రోజు సినిమాపై మాట్లాడిన కొండా సురేఖ ఇదే సమయంలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేస్తూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయంగా అణగదొక్కే కుట్ర చేసిన ఎర్రబెల్లి .. అయినా సరే మంత్రిగా మొదట నేనే
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై హాట్ కామెంట్స్ చేసిన సురేఖ రాజకీయంగా తమను అణగదొక్కడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేశారని, అందులో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒకరని వ్యాఖ్యానించారు. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు కంటే ముందే తాము రాజకీయాల్లో ఎదిగామని మంత్రి పదవిని దక్కించుకున్నామని కొండా సురేఖ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పట్లో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నంతకాలం ఆ పార్టీలోకి మేము రామని తేల్చి చెప్పామని కొండా సురేఖ స్పష్టం చేశారు.

ఎర్రబెల్లిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ
అంతేకాదు తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాలను బట్టి తాము టిఆర్ఎస్ పార్టీలో చేరామని కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావును ఉద్దేశించి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఒక్క తల్లికి పుట్టినా ... నేను టిడిపిని విడిచిపెట్టేది లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నోసార్లు చెప్పాడని.. ఇప్పుడు ఆయన టిఆర్ఎస్ లో ఉన్నాడని, ఇక ఆయన పుట్టుక గురించి ఆయనకే తెలియాలి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కొండా సురేఖ.
కొండా సినిమా చరిత్ర సృష్టిస్తుంది అన్న కొండా సురేఖ
రామ్ గోపాల్ వర్మ తీస్తున్న కొండా సినిమా ఓ చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్న కొండా సురేఖ, కొండా మురళి జీవిత చరిత్రలో రాజకీయంతో పాటు, తమ ప్రేమ చరిత్ర కూడా ఉంటుందంటూ పేర్కొన్నారు. తాను చదువుకునే రోజుల్లోనే ఉదయం ఏడు గంటలకే తనకోసం మురళి బైక్ పై చక్కర్లు కొట్టే వాడిని తమ ప్రేమ ప్రయాణాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. తమ రాజకీయ జీవితాన్ని, ప్రేమ ప్రయాణాన్ని రెండింటినీ కలిపి తెరకెక్కిస్తున్న రాంగోపాల్ వర్మ సినిమా చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నాను అంటూ కొండా సురేఖ స్పష్టం చేశారు.
కొండా వర్సెస్ ఎర్రబెల్లి మళ్ళీ షురూ అయినట్టేనా?
కొండా సురేఖ ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి చేసిన వ్యాఖ్యలతో, ఈ సినిమాలో ఎర్రబెల్లికి సంబంధించిన అంశాలు ఉంటాయనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ మరోమారు కొండా వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య వార్ కొనసాగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా తాజాగా కొండా సురేఖ ఎర్రబెల్లి దయాకర్ రావు పై చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ విధంగా స్పందిస్తారు అనేది రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications