konda surekha video viral: మేడారం జాతరకు మంత్రి కొండా సురేఖ దూరం?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మేడారం జాతర చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మేడారం జాతర పనులను మంత్రి కొండ సురేఖ, మంత్రి సీతక్క తమ భుజస్కంధాలపై వేసుకుని నిరంతరం పర్యవేక్షించారు. అయితే ప్రస్తుతం మేడారం జాతరకు కొండా సురేఖ దూరంగా ఉన్నారు.
కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా మేడారంలో హడావిడి కొనసాగిస్తారు అనుకున్న క్రమంలో కొండా సురేఖ కనిపించకపోవడానికి కారణమేమిటి? అన్న చర్చ జరుగుతుంది. తెలంగాణ అటవీ దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖల తన మంత్రిత్వ శాఖల కార్యక్రమాలను, మేడారం జాతర పనుల పర్యవేక్షణను హైదరాబాద్లోని తన నివాసం నుంచే కొనసాగిస్తున్నారు.

గత వారం రోజుల క్రితం వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉంటూ, ప్రభుత్వ కార్యక్రమాలలో బిజీ గా తిరుగుతూ, అసెంబ్లీలోనూ తనదైన గళాన్ని వినిపించి, వరుస సమీక్షలతో హడావిడి చేసిన, నిత్యం మేడారం జాతర పనుల పైన ఫోకస్ చేసిన కొండ సురేఖ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు.
గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కొండా సురేఖకు వైద్య పరీక్షలలో డెంగ్యూ ఫీవర్ గా తేలింది. దీంతో కొండ సురేఖ ప్రస్తుతం ఇంట్లోనే వైద్య చికిత్సలు తీసుకుంటూ, రెస్ట్ లో ఉన్నారు. బయట కొండా సురేఖ కనపడకపోవడంతో చర్చ జరుగుతున్న వేళ తన ఆరోగ్య పరిస్థితిని కొండా సురేఖ నేరుగా మీడియాకు వెల్లడించారు.
చాలా నీరసంగా మాట్లాడిన కొండా సురేఖ గత వారం రోజులుగా తను డెంగ్యూ తో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలోనే మేడారం జాతర పనులకు దూరంగా ఉన్నట్టుగా కొండా సురేఖ వెల్లడించారు. విపరీతంగా నీరసించిన కొండ సురేఖకు సిలైన్ లు, యాంటీబయాటిక్స్ తో వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు.
ఈ కారణంగానే విపరీతంగా తనకు నీరసంగా ఉందని, డెంగ్యూ ఫీవర్ వల్ల తను బయటకు రాలేకపోతున్నానని ప్రజలు అర్థం చేసుకుంటారని కొండా సురేఖ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే వైద్యులు మరో మూడు నాలుగు రోజుల్లో తన ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మళ్లీ యధావిధిగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారని సురేఖ అభిమానులు భావిస్తున్నారు.
దేవాదాయ శాఖ మంత్రిగా మేడారం జాతరను ముందుండి కొండా సురేఖ నడిపిస్తారు అనుకుంటే సురేఖ రిలీజ్ చేసిన తాజా వీడియోను బట్టి ఆమె మేడారం జాతరకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఏది ఏమైనా చాలా గొప్పగా కొండా సురేఖ నిర్వహించాలని భావించిన మేడారం జాతరకు కొండా సురేఖ రాలేకపోతే మాత్రం అది ఆమె అభిమానులకు ఒక డిజప్పాయింట్ మెంట్ అనే చెప్పాలి.












Click it and Unblock the Notifications