అవమానిస్తున్నారు... కడియం శ్రీహరి టార్గెట్ గా మీనాక్షి నటరాజన్ కు కొండా సురేఖ ఫిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఫిర్యాదులు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖకు స్థానికంగా ఉన్న నాయకులకు అసలే పొసగని పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కీలకఫిర్యాదు చేశారు.
తన ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన
కడియం శ్రీహరిపై నాలుగు పేజీల ఫిర్యాదు లేఖను అందజేసిన కొండా సురేఖ, తన ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న వ్యాఖ్యలు, రాజకీయంగా ఎదురవుతున్న పరిస్థితులపై వివరంగా ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.ఈ విషయాలన్నింటినీ ఓపికగా విన్న మీనాక్షి నటరాజన్, పార్టీ పెద్దలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

వ్యక్తిగతంగా ఎదురవుతున్న అవమానాలపై కొండా సురేఖ ఫిర్యాదు
అదే సమయంలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటించాలని, చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యగా మార్చుకోవద్దని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తనకు వ్యక్తిగతంగా ఎదురవుతున్న అవమానాలను విస్మరించడం సాధ్యం కాదని, ఇది కేవలం రాజకీయ అంశం మాత్రమే కాకుండా తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని కొండా సురేఖ స్పష్టం చేసినట్లు సమాచారం.
కడియం శ్రీహరి స్పందన ఇలా
మరోవైపు కడియం శ్రీహరి తాను ఎటువంటి తప్పు చేయలేదని, తన నియోజకవర్గంలోని కార్యక్రమంలో, సమీక్షలో తను పాల్గొన్నానని, అందులో కొండా సురేఖను కించపరిచిన అంశాలు ఏవీ లేవని చెబుతున్నారు. కొండా సురేఖ, కొండ మురళి దంపతులకు కాంట్రవర్సీ లతో రాజకీయం చేయటం అలవాటుగా మారిందని అంటున్నారు. మాట్లాడితే బీసీ మహిళ కార్డు వాడుతున్నారని మండిపడుతున్నారు.
ఫిర్యాదులపై అధిష్టానం ఏం చేస్తుందో
కడియం శ్రీహరికి మద్దతుగా, వరంగల్ జిల్లా నాయకులు కూడా సురేఖకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్ఠానం ఈ ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications