కొండా సురేఖకు వరుస షాక్ లు.. భద్రత తగ్గింపు, గన్ మెన్లు వెనక్కి.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం స్వాధీనం..!
మాజీ మంత్రి కొండా సురేఖకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సుతో కొండా సురేఖను గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తొలగించారు. ఇక ఆమె దేవాదాయ శాఖ మంత్రి పదవిని కోల్పోయిన నేపథ్యంలో ఆమె భద్రతను కుదించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఆమెకు కేటాయించిన గన్ మెన్లను వెనక్కి రప్పించారు అధికారులు. అలాగే ఆమె నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మొన్నటి వరకూ మంత్రి హోదాలో సురేఖకు ఉన్న 4 4 భద్రతను మొత్తంగా తొలగించారు అధికారులు. ఈ క్రమంలో కొండా సురేఖ మరింత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
ఇక కొండా సురేఖ బర్తరఫ్ పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ బర్తరఫ్ బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇక కొండా సురేఖ కాంగ్రెస్ లో కొనసాగుతారని చెప్పారని.. ఆమె పార్టీలో కొనసాగితే తప్పకుండా అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ ఆవేశం, ఆవేదనతో మాట్లాడారన్నారు. ఇకపై కొండా సురేఖ అలా మాట్లాడకూడదని ఆయన సూచించారు. ఎవరికైనా సమస్యలుంటే నేరుగా తన వద్దకు వచ్చి చెప్పుకోవచ్చని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

మరోవైపు కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ పార్టీ నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను బీఆర్ ఎస్ పార్టీలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. బీఆర్ ఎస్ లోకి చాలా మంది నేతలను తీసుకునేది లేదని ఇప్పటికే చెప్పామని అన్నారు. పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని తప్ప ఎవరినీ తీసుకోబోమని జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కొందరు బీఆర్ ఎస్ లో తిరిగి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications