ఏపీలో టీడీపీ చేసింది.. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ చేయలేదా?
సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. సింగరేణి రక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.
16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ అన్నారని.. అయితే, 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెరో 8 ఎంపీ సీట్లు ఉన్నాయి కానీ, ఆ రెండు పార్టీలు కలిసి సింగరేణిని ఖతం చేసేందుకు కుట్రపన్నుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.

బొగ్గు గనుల వేలం పెట్టవద్దని గతంలో రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీ లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు ఆయన రాజీ పడుతున్నారని ప్రశ్నించారు. దీని వెనకాల ఉన్న మతలబు ఏంటి? అని నిలదీశారు. కేసులకు భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. కొత్తగా కేంద్రమంత్రి అయితే రాష్ట్రానికి ఏమైనా కొత్త ప్రాజెక్టు తీసుకొస్తారని, కానీ కిషన్ రెడ్డి మాత్రం ఉన్న గనులను అమ్ముతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేలం లేకుండానే గనులను అప్పగించారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ, సింగరేణికి మాత్రం బొగ్గు గనులు కావాలంటే వేలంలో పాల్గొనాలంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. అదానీకి బైలదిల్లా గని కేటాయించడం వల్ల విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లిందని.. నష్టాల్లోకి వెళ్లింది కాబట్టి విశాఖ ఉక్కు అమ్ముతున్నామని కేంద్రం చెప్పిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
LIVE : BRS Working President @KTRBRS addressing the media at Telangana Bhavan https://t.co/1INIbRxZgn
— BRS Party (@BRSparty) June 20, 2024
నేడు సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకే వేలంలో పాల్గొనాలని చెబుతున్నారన్నారు. బొగ్గు గనులు కేటాయించకపోతే సింగరేణి నష్టాల్లోకి వెళ్తుందని కేటీఆర్ చెప్పారు. సింగరేణి మెడపై కేంద్రం కత్తి పెడితే.. రేవంత్ రెడ్డి ఆ కత్తికి సాన పడుతున్నారన్నారని విమర్శించారు కేటీఆర్.












Click it and Unblock the Notifications