సీఎం అంటే కటింగ్ మాస్టరా.. ఆ విషయంలో రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకంలోనూ కోతలు పెడుతుండడం పైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అంటే కటింగ్ మాస్టరా అంటూ ఎక్స్ వేదికగా నిలదీసిన కేటీఆర్ ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రతి పథకంలోనూ సవాలక్ష కొర్రీలు, కోతలు పెడుతోందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సీఎం పదానికి కొత్త అర్ధం చెప్పిన కేటీఆర్
సీఎం అనే పదానికి సరికొత్త నిర్వచనం కటింగ్ మాస్టరా అంటూ ప్రశ్నించారు. గతంలో రైతులను పరుగు పరుగున వెళ్లి లోన్లు తెచ్చుకోమని చెప్పారని, కానీ ఇప్పుడు రైతుల రుణమాఫీ విషయంలో రెండు లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మొదటి 39 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి ఇస్తామని చెప్పి, ఇప్పుడు 31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారన్నారు.

చూస్తూ ఊరుకోం ..కేటీఆర్ హెచ్చరిక
దాదాపు లక్ష మందికి పాసు పుస్తకాలు లేవు అనే నిపంతో శఠగోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈ కుటిల ప్రయత్నాలను తాము సహించమని కేటీఆర్ అన్నారు. ఇక ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి శూన్య హస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు.
రైతులకు ఎగానామం పెడతామంటే కుదరదు
మొన్న లక్షలాది మందిని 500 రూపాయలు సిలిండర్ పథకానికి దూరం చేశారని, నిన్న 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారని, నేడు రెండు లక్షల రుణమాఫీ ని కూడా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదని కేటీఆర్ తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ ప్రచారంలో అందరికీ అన్నీ.. అధికారంలో కొందరికే కొన్ని
నాట్లనాడు ఇవ్వవలసిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కు లేదని, ఇక ఓట్ల పండుగ ముగిసినా 7,500 ఎకరానికి రైతు భరోసా ఇస్తామని చెప్పినా, రైతు భరోసా అడ్రస్ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రచారంలో అందరికీ అన్నీ అన్నారని, కానీ అధికారంలోకి రాగానే కొందరికే కొన్ని అని కోత పెడుతున్నారు అంటూ కేటీఆర్ తెలిపారు. రుణమాఫీ పై మాట తప్పినా, మడమతిప్పినా లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తామని పోరాడుతామని కేటీఆర్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications