మైనార్టీలు-బీసీల మధ్య కాంగ్రెస్ చిచ్చు: బీజేపీకి ఆ ఒక్క సీటూ రానివ్వమన్న కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR). బీజేపీ స్ఫూర్తితో కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినట్లుందంటూ ఎద్దేవా చేశారు. మైనార్టీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయన్నారు కేటీఆర్. శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి.. మైనారిటీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుట్రచేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ గతంలోనూ ఇలా చాలా సార్లు తప్పుడు వాగ్దానాలు ఇచ్చిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ.. బీసీలు, ముస్లింలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తోందని కేటీఆర్ ఆరోపించారు. 2004- 2014 మధ్య కాంగ్రెస్ మైనారిటీలకు ఏం చేసిందని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ మైనారిటీల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.

బీసీల కులగణనలోకి ముస్లింలను చేర్చుతామని కాంగ్రెస్ డిక్లరేషన్ చెబుతోందని.. ఇది ఒక కుట్ర అని ధ్వజమొత్తారు. ఈ డిక్లరేషన్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కోత్తేమీ కాదని.. గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, అలా చేస్తే మైనారిటీలు ప్రత్యేక హోదా పోతుందని కేటీఆర్ అన్నారు. మైనారిటీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు.
ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు రాజ్యాంగపరంగా మతపరమైన మైనారిటీలని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యి ఆటలాడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ముఖ్య నేతల సీట్లలో కాంగ్రెస్ పార్టీ వీక్ క్యాండిడేట్స్‌ను నిలబెట్టిందన్నారు. మరోవైపు, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
గజ్వేల్ లో కేసీఆర్‌పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఇద్దరూ ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. 2018లో గెలిచిన గోషామహల్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెలుచుకుంటుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కోడంగల్‌లోనూ రేవంత్ రెడ్డిని మరోసారి ఓడిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications