ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు: మోడీ హవాపై కేటీఆర్ ఆసక్తికరం, రాహుల్ ఉన్నంత వరకు..
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. అయితే దీనిపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ హవా 2019వరకు ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు
హైదరాబాద్: అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. అయితే దీనిపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ హవా 2019 వరకు ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు.
ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవని, 2019 వరకూ మోడీ హవా ఉంటుందో ఉండదోనని, ఏమైనా జరగవచ్చునని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు. బీజేపీనే కాదని, ఎవరైనా తెలంగాణపై ఫోకస్ చేసుకోవచ్చన్నారు.

మాకు అభ్యంతరం లేదు
2019 ఎన్నికలు టార్గెట్‌గా బీజేపీ పనిచేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. 2019లోనూ అధికారం తెరాసదేనని ధీమా వ్యక్తం చేశారు. తాము చేస్తున్న అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు.

రాహుల్ గాంధీ ఉన్నంత కాలం కాంగ్రెస్ అంతే
రాహుల్ గాంధీ ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాహుల్ ఉన్నంత కాలం ఏమీ కాదని, కాంగ్రెస్ పార్టీని ఎవరూ నాశనం చేయలేరన్నారు. ఎందుకంటే వాళ్ల పార్టీ నేతలు ఇతరులకు ఆ అవకాశం ఇవ్వబోరని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.

కాంగ్రెస్‌ను ఎవరూ నాశనం చేయలేరు.. వారికి వారే
రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాశనమవుతుందన్నారు. కేంద్రంలో చేరాల్సిన అవసరం తమకు లేదన్నారు. కేంద్రంలో చేరిన వాళ్లకు అంతగా నిధులేమైనా వస్తున్నాయా? అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ చెప్పారు..
అయినా, కేంద్రం మిథ్య అని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎప్పుడో చెప్పారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు నాయకుడిగా ఉన్నారన్నారు.

కేసీఆర్ లాంటి నాయకుడు లేరు
ఇతర పార్టీల్లో కేసీఆర్ అంతటి సామర్థ్యం ఉన్న నాయకుడు ఐదారు కిలోమీటర్ల దూరంలో కూడా లేడని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు మీ పార్టీలోకి వచ్చారని, పార్టీ ఫిరాయింపులతో వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా, ఫిరాయింపులతో తెరాసకు వచ్చిన నష్టమేమీ లేదని కేటీఆర్ చెప్పారు.

చంద్రబాబు అడుగుతున్నారు..
రాష్ట్రంలో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు కచ్చితంగా జరిగి తీరుతుందన్నారు. ఏపీలో నియోజకవర్గాలను పెంచాలని చంద్రబాబు అడుగుతున్నారని, ఆయన కోసం పెంచే క్రమంలో కేంద్రం తెలంగాణలో కూడా పెంచి తీరుతుందన్నారు.

బీజేపీపై..
రాష్ట్రంలోని బీజేపీ నేతలు పెంచకూడదని ప్రయత్నాలు చేస్తున్నారని, కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ నిండుగా ఉందని, ఎక్కువ మంది నాయకులు ఉన్నారని, వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎదురు చూస్తున్నారని, వాళ్ల పార్టీలో పోటీ చేయడానికి అవకాశం ఉన్నందున, వీళ్లందరినీ బీజేపీలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారేమో అని వ్యాఖ్యానించారు. బీజేపీలో పోటీ చేయడానికి నాయకులే లేరన్నారు.












Click it and Unblock the Notifications