కెసిఆర్‌తో లింక్‌పెట్టి మోడీని దులిపేసిన కెటిఆర్, నోరు అదుపులో పెట్టుకోమని తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేపదే ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పి ఏకిపారేశారు. ఇప్పటి వరకు తెలంగాణ వైపు మోడీ చూడలేదని, అలాంటప్పుడు బిజెపికి ఎలా ఓటేయాలని ప్రశ్నించారు.
మోడీకి సొంత నియోజకవర్గంలో బుద్ధి
ప్రధాని మోడికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత నియోజకవర్గం, సొంత రాష్ట్రంలోనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. మోడికి వరుస పరాభవాలే ఎదురవుతున్నాయన్నారు. అదే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తెలంగాణ ప్రజలు రోజురోజుకు ఆదరిస్తున్నారని చెప్పారు. పని చేసే నేతలకే ప్రజల మద్దతు ఉంటుందని చెప్పారు.
ఇక్కడ కెసిఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే, మోడీకి చుక్కెదురవుతోందన్నారు. ప్రధానీ మోడీ విదేశీ పర్యటనల పేరుతో విమానాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. అనుకోకుండా మోడీ ఇటీవల పార్లమెంటుకు వెళ్లి, కుర్చీ కోసం వెతికారన్నారు.
మోడీ ముఖం చూపించారా
ప్రధాని మోడీ ముఖం హైదరాబాదులో లేదా తెలంగాణలో ఎన్నికల తర్వాత ఎప్పుడైనా చూశామా అని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ ముఖమే చూపించలేదని, అలాంటప్పుడు బిజెపి నేతలు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

మోడీ ఇప్పిటిదాకా ఏం చేశారు, కెసిఆర్ చూపించారు
ప్రధాని మోడీ ఇప్పటిదాకా ఏం చేశారని కెటిఆర్ ప్రశ్నించారు. కెసిఆర్ ఈ పద్దెనిమిది నెలల్లో ఎన్నో చేశారన్నారు. డబుల్ బెడ్ రూం, గ్రామజ్యోతి ఇలా ఎన్నో చేశారన్నారు. కానీ ప్రధాని మోడీ ఏం చేశారంటే బిజెపి నేతలు రెండే చెబుతారని ఎద్దేవా చేశారు. ఒకటి స్వచ్ఛ భారత్, రెండోది జన్ ధన్ యోజన అన్నారు.
మన చేతుల్లోనే చీపుర్లు పెట్టి స్వచ్ఛ భారత్ అన్నారని, ఎవరి బ్యాంకు అకౌంట్ వారు తీసుకోవాలని జన్ ధన్ యోజన అన్నారని ఎద్దేవా చేశారు. అది మోడీ గొప్పతనమా అన్నారు. మోడీ మనకు ఏం ఇచ్చారని బిజెపి నేతలు ఓట్లు అడుగుతారన్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారన్నారు.
స్వచ్ఛ భారత్ ఎలాగో ప్రధాని మోడీకి మన సీఎం కెసిఆర్ చూపించారన్నారు. సఫాయి కార్మికుల జీతాలు పెంచారని, హైదరాబాదును పరిశుభ్రంగా చేశారని, కెసిఆర్ వంటి నాయకుడిని గ్రేటర్ ఎన్నికల్లో ప్రోత్సహిస్తే మరింత మంచి పనులు చేస్తారన్నారు.
తెలంగాణ భవన్లో ఖైరతాబాద్, మల్కాజిగిరి, అంబర్ పేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు.
అడ్డగోలు విమర్శలు చేసే వారి నోళ్లను... ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా ప్రజలు మూయించారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎటువైపు ఉంటే నాయకులు అటువైపు ఉంటారని చెప్పారు. పార్టీలు మారడం సహజమేనని చెప్పారు.
చంద్రబాబు, జానాలు పార్టీ మారిన వారే
ఒకప్పుడు చంద్రబాబు, జానారెడ్డిలు కూడా పార్టీలు మారిన వారే అని చెప్పారు. హైదరాబాదులో ఇక గూండాల రాజ్యం చెల్లదని కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలన్నారు. కెసిఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. ఉచితంగా పేదలకు పట్టాలు ఇచ్చామన్నారు. నల్లా బిల్లులు రద్దు చేశామన్నారు.
మనిషికు ఆరు కిలోల బియ్యం ఇస్తున్నారన్నారు. కెసిఆర్ మనవడు ఏ బియ్యం తింటే ప్రజలు అదే తింటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి మిగిలింది గతమేనని, వారికి భవిష్యత్తు లేదన్నారు. జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని, ప్రాంతీయ పార్టీలు ప్రజలకు దగ్గరవుతున్నారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎవరి పంచెలు ఊడుతాయో తేలిపోతుందన్నారు.
నోరు అదుపులో: తలసాని
దానం నాగేందర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాయిని నర్సింహా రెడ్డిని విమర్శించే స్థాయి దానంకు లేదన్నారు. ఏ పార్టీ పైన నమ్మకం లేకే తెరాసలోకి అందరూ వస్తున్నారని చెప్పారు. హైదరాబాదును విశ్వనగరంగా చేసేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.
ప్రతిపక్షాలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. హైదరాబాద్ దారులన్నీ తెరాస వైపే అన్నారు. పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గ్రేటర్లో గెలిచే పార్టీ తెరాసనే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ లీడర్లేనని, వారిలో వారికే పడదన్నారు.












Click it and Unblock the Notifications