నిర్మలమ్మకు కేటీఆర్ లేఖ - ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : ఆ హక్కు కేంద్రానికి ఎక్కడిది..!!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాసారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో డిమాండ్ చేసారు. 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను మోడీ ప్రభుత్వం అమ్మతోందని పేర్కొన్నారు. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని వివరించారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందన్న కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు.
ఈ 6 సంస్ధలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం సూమారు 7200 ఎకరాల భూమి కేటాయించిందని వివరించారు. ప్రభుత్వ ధరల ప్రకారం ఈ భూముల విలువ కనీసం 5వేల కోట్ల రూపాయాలకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం 40వేల కోట్లు ఉండనుందని స్పష్టం చేసారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. లేదంటే ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని సూచించారు.

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా ఆయా భూముల సద్వినియోగం జరగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసిందని కేటీఆర్ గుర్తు చేసారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ర్టం ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడుందని కేటీఆర్ ఈ లేఖలో ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications