బెదిరించేందుకే వచ్చారు - అమిత్ షా టూర్ పై కేటీఆర్ ఫైర్..!!
తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లో నిర్వహించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విలీన వేడకలు నిర్వహించటానికి భయపడుతున్నారంటూ షా వ్యాఖ్యానించారు. ఎవరు నిర్వహించినా..లేకపోయినా కేంద్రం వీటిని కొనసాగిస్తుందని అమిత్ షా స్పష్టం చేసారు. నాడు వల్లభాయ్ పటేల్ సైనిక చర్య కారణంగానే తెలంగాణకు రాజాకార్ల పాలన నుంచి విముక్తి లభించిందని చెప్పారు. ప్రధాని ఆదేశాల మేరకే అధికారికంగా విమోచన దినోత్సవం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు.
దీని పైన మంత్రి కేటీఆర్ స్పందించారు. 74 ఏళ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణను భారత్‌లో కలిపారని ఎద్దేవా చేశారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి తెలంగాణను విభజించి, బెదిరించేందుకు వచ్చారని మండిపడ్డారు. దేశానికి కావల్సింది విభజన రాజకీయాలు కాదని సూచించారు. దేశానికి నిర్ణయాత్మక విధానాలు కావాలన్నారు.

సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని చెప్పుకొచ్చారు. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచి ఉంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి,ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియోద్దీన్, షోయెబుల్లాఖాన్ వంటి సాహితీ మూర్తులకు ఘన నివాళులు అర్పిద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రజలే అప్రమత్తంగా ఉండాలని.. మతోన్మాదులు పెట్రేగిపోతున్నారని హెచ్చరించారు. ఎన్నో కష్టాలు పడి తెలంగాణ సాధించుకున్నామని..అన్నింటి అగ్రభాగాన నిలుస్తున్న తెలంగాణ ఏ మాత్రం అద మరిచినా కుట్రలు చేసే శక్తులు సిద్దంగా ఉన్నాయంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications