కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు, హెచ్చరిక
తనపై తీవ్ర ఆరోపణలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్‌పై అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యాలని అన్నారు. తన గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలుగా మాట్లాడారన్నారు.
కొండా సురేఖ మంత్రి హోదాను దుర్వినియోగం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అసత్యాలు చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజలు నిజమని భావించే ప్రమాదం ఉంది. గతంలోనూ ఆమె అడ్డగోలుగా మాట్లాడారు. వీటిపై ఏప్రిల్ లోనే నోటీసులు పంపించాను. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. దావాతోపాటు క్రిమినల్ కేసులు వేస్తానని అన్నారు.

కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారన్నారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరం అన్నారు కేటీఆర్. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా కొండా సురేఖ మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు
కొండ సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలనే పదేపదే అవే అబద్దాలను తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం చేస్తుందని కేటీఆర్ అన్నారు. కొండా సురేఖ ఈరోజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు. దీంతోపాటు అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని
కేటీఆర్ సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.
కొండా సురేఖ ఏమన్నారంటే.?
తనపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో, ఫొటోలతో ట్రోల్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ అని అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని ఆరోపించారు. దొంగ ఏడుపులు తనకు అవసరం లేదని కొండా సురేఖ అన్నారు.
సిగ్గులేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. హరీశ్ రావు మనసున్న మనిషిలా స్పందించారు. నీవెందుకు రియాక్టు కాలేదు.. మనిషివి కాదా.. పశువా అంటూ కేటీఆర్ పై సంచలన విమర్శలు చేశారు. నీకు తల్లి లేదా అని ప్రశ్నించారు. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి పోస్టులు పెడుతున్నారన్నారు. మనుషుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా నీకు? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కొంతమంది తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమని సురేఖ అన్నారు.
సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది హీరోయిన్లు బయటకు వెళ్లిపోవడానికి కూడా కేటీఆరే కారణమని మండిపడ్డారు కొండా సురేఖ. ఎంతోమంది సినిమా హీరోయిన్ల జీవితాతో కేటీఆర్ ఆడుకున్నారని ఆరోపించారు. దసరా పండుగ ముందు ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదన్నారు. ప్రతిదానికీ ట్విట్టర్ లో స్పందించే కేటీఆర్.. తన మీద ట్రోల్ చేసినదానిపై ఎందుకు స్పందించలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. ఫొటోలు మార్ఫింగ్ చేయాలనుకుంటే తాము కూడా చేయగలమని అన్నారు.












Click it and Unblock the Notifications