ఊడి పడ్డ టీజీఎస్ఆర్టీసీ బస్సు టైర్లు
TGSRTC: నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. వేగంగా వెళ్తోన్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్డినరీ బస్సు టైర్లు ఊడి పడ్డాయి. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కలగలేదు. టైర్లు ఊడిపడటంతో బస్సు కుదుపులకు లోనైంది. వెనుక భాగం దెబ్బతింది.
నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాలకు వెళ్తోండగా.. మార్గమధ్యలో మోరపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సు ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించింది. సామర్థ్యానికి మించిన జనం అందులో ఎక్కారు. సుమారు 170 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.

50 సీటింగ్ సామర్థ్యం ఉన్న రెండురెట్ల కంటే అధికంగా అంటే 170 మంది ప్రయాణికులు ఎక్కడం ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తోన్నారు. బరువును తట్టుకోలేకపోవడంతో బస్సు వెనుకవైపు ఉన్న టైర్లు ఊడిపోయాయి. రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి. ఒక్కసారిగా బస్సు వెనుక భాగం మొత్తం కూడా రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
రోడ్డు పక్కన, పొలాల్లో పడ్డ బస్సు టైర్లను డ్రైవర్, కండక్టర్.. ప్రయాణికుల సహాయంతో పైకి తీసుకొచ్చారు. మరో బస్సు అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రయాణికులు అక్కడే పడిగాపులు పడాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఉండటం కనిపించింది.
ఈ ఘటన పట్ల భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అదృష్టం బాగుండటం వల్లే ఈ దుర్ఘటన నుంచి బయటపడ్డారని చెప్పారు.
ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటాలాడుకుంటోందంటూ కేటీఆర్ ఆరోపించారు. చాలినన్ని సరిపడా బస్సులు నడపకుండా ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందంటూ విమర్శించారు. బస్సుల సంఖ్యను ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించారు.
సీటింగ్ సామర్థ్యానికి అనుగుణంగా ప్రయాణీకులు బస్సులు ఎక్కేలా, చాలినన్ని బస్సులను నడిపించేలా ఏదైనా భద్రతా ప్రోటోకాల్‌ను ప్రభుత్వం అమలు చేస్తోందా? అంటూ ప్రశ్నించారు. ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తోన్న డ్రైవర్లు, కండక్టర్లకు ఎలాంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తోన్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications