KTR కొత్త ఉద్యమం!
తెలంగాణలోని చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రధానికి లక్షలాది ఉత్తరాలు రాయాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఆయన కూడా స్వయంగా ఒక పోస్టు కార్డును మోడీకి రాశారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే చేనేత కార్మికుల సమస్యలను పలు సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఆశించిన రీతిలో స్పందన రాలేదని కేటీఆర్ వెల్లడించారు. చేనేత సమస్యలపై సీఎం కేసీఆర్‌తో పాటు తాను కూడా పలుమార్లు ప్రధానమంత్రికి స్వయంగా లేఖలు రాశానని చెప్పారు.
చేనేత కార్మికుల సంక్షేమ పథకాలను కేంద్రం రద్దు చేసిందని, అంతేకాకుండా చేనేత ఉత్పత్తులపై పన్ను వేసిందని, ఇలా చేయడం దేశ చరిత్రలో తొలిసారని కేటీఆర్ మండిపడ్డారు. స్వాతంత్ర్య సంగ్రామంలో జాతిని ఏకతాటిపై నడిపించింది చేనేత వస్త్రాలేనని, అటువంటి వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోడీయేనన్నారు.

ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మనిర్భర్ భారత్, గాంధీ మహాత్ముని సూత్రాలను నిత్యం వల్లెవేస్తారని, విధానాల్లో మాత్రం వాటికి దూరంగా ఉంటారన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోంది టెక్స్ టైల్ రంగమేనని, నేత కార్మికులను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలన్నారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే సాంస్కృతిక సారథులుగా వారిని పరిగణించాలని, వెంటనే పన్నును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ పోస్టుకార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు












Click it and Unblock the Notifications