అయినను పోయి రావలె హస్తినకు!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు దారుణంగా మారాయని, సీఎం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాలు అడుగడుగునా కనపడుతున్నాయని ఢిల్లీ చుట్టూ ప్రదిక్షణలు చేయడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు.
10 నెలల్లో 50 రోజులు ఢిల్లీ చుట్టూ తిరిగి ఏం లాభం
తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పైసా పనిలేదు - రాష్ట్రానికి రూపాయి లాభం లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శలు గుప్పించారు. 10 నెలలు - 25 సార్లు - 50రోజులు ఢిల్లీ చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదని రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమీ లేదని పేర్కొన్నారు.

ఇప్పటికి ఢిల్లీ చుట్టూ సిల్వర్ జూబ్లీ చేశావ్... ఏం ప్రయోజనం
పోను 25 సార్లు, రాను 25 సార్లు, మీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేశావు అంటూ రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు .. అయినను పోయి రావలె హస్తినకు అంటూ రేవంత్ రెడ్డి పైన సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అన్నదాతల అరిగోసలు పడుతున్నారని, గాల్లో దీపాల మాదిరిగా గురుకులాలు మారాయని మండిపడ్డారు.
అయినను పోయి రావలె హస్తినకు.. కేటీఆర్ సెటైర్లు
రాష్ట్రంలో వైద్యం కుంటుపడిందని, విద్యా వ్యవస్థ గాడి తప్పిందని పేర్కొన్న కేటీఆర్ అయినను పోయి రావలె హస్తినకు అంటూ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి హస్తిన చుట్టూ తిరుగుతున్నారని టార్గెట్ చేశారు. మూసి పేరుతో, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి, ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి ప్రజలకు ఏమి చేయకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
తెలంగాణాలో ఇచ్చిన హామీల జాడే లేదు.. కానీ
తెలంగాణ రాష్ట్రంలో పండుగలు పండుగలలా లేవని, ఆడబిడ్డలకు చీరలు అందలేదని అవ్వా తాతలు అనుకున్న పింఛన్లు రావడం లేదని, తులం బంగారం ఇస్తానని చెప్పి దాని జాడనే లేకుండా పోయిందని, స్కూటీలు లేవు, కుట్టుమిషన్లు లేవు ఇస్తాం అని చెప్పిన హామీలు ఏవీ ఇచ్చింది లేదని అయినను పోయి రావలె హస్తినకు అంటూ టార్గెట్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని చెబుతూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications