జూబ్లీహిల్స్ లో మారుతున్న లెక్కలు, కలిసొచ్చేదెవరికి..!!
జూబ్లీహిల్స్ లో బై పోల్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలోకి దిగారు. సర్వే నివేదికల ఆధారంగా వ్యూహాలను మార్చుతున్నారు. బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను సీనియర్లకు అప్పగించారు. సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ లో గెలుపు వ్యక్తిగత ప్రతిష్ఠగా భావిస్తున్నారు. మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వ్యూహం మార్చింది. కాంగ్రెస్ - బీజేపీ లక్ష్యంగా కొత్త తరహా ప్రచారం చేస్తోంది. దీంతో, నియోజకవర్గంలో ప్రచారం వేళ రాజకీయం మరింత హోరా హోరీగా మారుతోంది.
జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహ ప్రతి వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం నేరుగా సీఎం రేవంత్ పర్యవేక్షిస్తున్నారు. మంత్రులను డివిజన్ల వారీగా రంగంలోకి దించుతున్నారు. ప్రచారం చివరి రెండు రోజులే తానే రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ సర్వే నివేదికలు తమకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ ముఖ్య నేతలు ప్రచారం సాగిస్తున్నారు. ఇదే సమయంలో కేటీఆర్ కొత్త నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రెండేళ్లలో కేసీఆర్‌ని తిట్టడం తప్ప సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఏమి చేశారని నిలదీశారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తాము మోసం చేసి..నా తమకు ఓటు వేశారని అంటారంటూ చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో పాలనా పరమైన లోపాలను ప్రధానంగా ప్రస్తావన చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రులకి మధ్య సయోధ్య లేక కొట్టుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో హామీలిచ్చి ఒక్క పైసా కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఓటు కోసం కాంగ్రెస్ వాళ్లు ప్రమాణం చేస్తారని.. తర్వాత పట్టించుకోరని ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆర్‌ని అధికారంలోకి తెచ్చుకోవటానికి.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. అన్ని మతాల వారిని, అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ మోసం చేసిందని ఆక్షేపించారు. మైనార్టీ సబ్ ప్లాన్ పెడతామన్నారని.. అది కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని సూచించారు. అటు కాంగ్రెస్ సైతం ధీటుగా ప్రచారం చేస్తోంది. మంత్రులు.. పలు నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలు ప్రతీ ఇంటిని టచ్ చేస్తున్నారు. దీంతో.. ఇక్కడ ఈ రెండు పార్టీల వ్యూహాలు ఎవరికి కలిసి వస్తాయనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications