బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా రేవంత్ రెడ్డి..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా రేవంత్ సర్కారు టార్గెట్ చేసిన ఆయన రాష్ట్రంలో అనేక సమస్యల పైన రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్నలు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, అన్ని వర్గాల్లో ఆగ్రహానికి కారణమైందని పేర్కొన్నారు
ఇంత అన్యాయం ఎప్పుడైనా వుందా?
సకల జనులను దగా చేసింది కాంగ్రెస్ సర్కార్ అంటూ మండిపడ్డారు. ఉద్యోగులు..నిరుద్యోగులు..విద్యార్థులు..రైతులు..కార్మికులు..మహిళలు సమాజంలోని ప్రతి సెక్షన్ ఆందోళన బాటలోనే వున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించి ఐదు డీఏలు పెండింగ్‌లో వుంచడం ఏంటి..ఇంత అన్యాయం ఎప్పుడైనా వుందా? అని ప్రశ్నించిన కేటీఆర్ ఉద్యోగ సంఘాల విన్నపాలు వినయ్ తీరిక కూడా లేదా అంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు

మేనిఫెస్టోలో నాడు మీరు ప్రకటించింది వాస్తవం కాదా?
కనీసం కలిసి మాట్లాడటానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలను అవమానించడం భావ్యమా? అని ప్రశ్నించారు. కొత్త పీఆర్‌సీ వేసి ఆరు నెలల్లోనే సిఫారసులు అమలు చేస్తామని మేనిఫెస్టోలో నాడు మీరు ప్రకటించింది వాస్తవం కాదా? చెప్పాలని నిలదీశారు. 11 నెలలు గడిచినా రెండో PRC నివేదికను ఎందుకు తెప్పించుకోలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి ఇది నిదర్శనం
సీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం తిరిగి తెస్తామని మాటిచ్చి ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా? రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ టార్గెట్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. మంచిది కాదని వాళ్ళ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలని సూచించారు.
ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని..?
అంతేకాదు మరొక ట్వీట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మీ సొంత పార్టీ నేతలే మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారని చెప్పి ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా అంటూ ప్రశ్నించారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే.. ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అని మీ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications