కాంగ్రెస్ లోకి షర్మిల, రాహుల్ తో చర్చలు - కేవీపీ కీలక వ్యాఖ్యలు..!!
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో ఎంట్రీ ఖాయమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన వేళ ఈ అంశం పైన స్పష్టత వచ్చింది. ఏపీలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు. అమరావతికి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేసారు. త్వరలో అమరావతితో ప్రియాంక పర్యటించనున్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ పోరాటంలో రాహుల్ భాగస్వామి కానున్నారు. షర్మిల కాంగ్రెస్ లో ప్రవేశంపై కేవీపీ కీలక వ్యాఖ్యలు చేసారు.
కాంగ్రెస్ లోకి షర్మిల:రాహుల్ గాంధీ ఏపీ రాజకీయం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఖమ్మం సభకు వచ్చిన రాహుల్ గాంధీ తిరుగు ప్రయాణంలో గన్నవరంలో ఏపీ నేతలతో సమావేశమయ్యారు. ఏపీలో రాజకీయాలపైన చర్చించారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీతో సఖ్యతగా ఉంటున్నాయని కాంగ్రెస్ నేతలు వివరించారు. అమరావతి ఏపీ రాజధానిగా ఉండాలనే నిర్ణయానికి తమ మద్దతు కొనసాగుతుందని రాహుల్ స్పష్టం చేసారు.

త్వరలోనే అమరావతిలో భూములిచ్చిన రైతులకు మద్దతుగా ప్రియాంక పర్యటనకు వస్తారని వెల్లడించారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సాగే పోరాటానికి తాను హాజరు అవుతానని..వచ్చే నెలలో విశాఖకు వస్తానని రాహుల్ స్పష్టం చేసారు.
రాహుల్ దిశా నిర్దేశం:ఇదే సమయంలో కాంగ్రెస్ లోకి షర్మిల ప్రవేశం పైన చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. షర్మిల కాంగ్రెస్ లోకి రావటం ద్వారా ఏపీలో పార్టీకి ప్రమోజనకరమనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయింది. షర్మిల కాంగ్రెస్ తో పొత్తు ..వైఎస్పార్టీపీ కాంగ్రెస్ లో విలీనం పైన తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ తో కలిసి రాజకీయ ప్రయాణం పైన ఈ నెల 8న షర్మిల ప్రకటన చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచనగా స్పష్టం అవుతోంది.
షర్మిల తాను తెలంగాణకు పరిమితం కావాలనే ఆలోచనలో ఉన్నారు. అదే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసారని చెబుతున్నారు. దీని పైన ఈ రోజు లేదా రేపు షర్మిలతో కాంగ్రెస్ అగ్రనాయత్వం చర్చించి క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

నిర్దారించిన కేవీపీ:షర్మిల కాంగ్రెస్ లోకి రావటం పైన కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేసారు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారనే సమాచారం ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ వాదిగా, వైఎస్ బిడ్డగా ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాహుల్ తో చర్చల తరువాత కేవీపీ ఈ వ్యాఖ్యలు చేసారు. ఏపీలో పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ సూచనలను అమలు చేస్తామని చెప్పారు. టీడీపీ పొత్తుతో నష్టపోయామన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణకు పరిమితం అవుతారా..ఏపీలోనూ పని చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications