మీకు తల్లీ, చెల్లే ఉన్నారు: అరుణ, సారీ చెప్పిన డీకే, కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య శాసన సభలో మంగళవారం గందరగోళం చెలరేగింది. మీరు క్షమాపణ చెప్పాలంటే మీరు క్షమాపణ చెప్పాలని ఇరు పార్టీలు డిమాండ్ చేశాయి. నోరు మూసుకో అన్నందుకు డీకే అరుణ క్షమాపణ చెప్పాలని తెరాస అంటే, మహిళను పట్టుకొని సిగ్గుందా అన్నందుకు అధికార పార్టీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చివరకు ఇరు పక్షాలు క్షమాపణ చెప్పాయి. దానికి ముందు వాదోపవాదాలు జరిగాయి.
దాదాగిరి చేస్తే చర్యలు తీసుకోండి: డీకే అరుణ
తాము దాదాగిరి చేస్తే చర్యలు తీసుకోవచ్చునని డీకే అరుణ అన్నారు. ఓ మహిళా ఎమ్మెల్యేను మంత్రి కడియం సిగ్గుండాలి అనవచ్చా అని ప్రశ్నించారు. తాను నోరు మూసుకొమ్మని ఎందుకు అన్నానో తెలుసుకోవాలన్నారు. అధికార పక్షం రన్నింగ్ కామెంటరీ మానుకోవాలన్నారు.
తన పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారితో క్షమాపణ చెప్పించాలన్నారు. మహిళా ఎమ్మెల్యేను అయిన తన పైన అసభ్యవ్యాఖ్యలు సరికాదన్నారు. అధికార పక్షాన్ని తాము ప్రశ్నించవద్దా అన్నారు. ఓ మహిళా ఎమ్మెల్యేను సిగ్గుండాలి అంటారా అన్నారు. తొలుత అధికార పక్షం క్షమాపణ చెప్పాలన్నారు.

అవాస్తవం: కడియం
డీకే అరుణ అవాస్తవాలు మాట్లాడుతున్నారని కడియం అన్నారు. తాను మహిళల్ని కించపరిచేలా మాట్లాడలేదన్నారు. డీకే అరుణను తాను కించపరచలేదని, సంప్రదాయాలు పాటించమన్నానని చెప్పారు.
సింపుల్‌గా చేబితే చాలు: కేసీఆర్
క్షమాపణ కోసం వాదోపవాదాలు జరుగుతుండగా.. సీఎం కేసీఆర్ కల్పించుకొని అంత పెద్ద మాటలు తమ పార్టీ సభ్యులు అన్నారా అని ప్రశ్నించారు. ఫుటేజీలో ఎవరు ఎమన్నారో కనిపించాయన్నారు. దానికి అంత రాద్దాంతం వద్దన్నారు. సింపుల్‌గా క్షమాపణ చెబితే సరిపోతుందన్నారు.
వారు అసభ్యంగా మాట్లాడవచ్చు.. నేను నోరు మూసుకోమనడం తప్పా: అరుణ
వారు తన పట్ల అసభ్యంగా మాట్లాడవచ్చు కానీ తాను నోరుమూసుకోమని చెబితే తప్పా అని డీకే అరుణ ప్రశ్నించారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలన్నారు. అధికార పార్టీ బేషజాలకు ఎందుకు పోతోందని ప్రశ్నించారు.
దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. తాము భేషజాలకు పోవడం లేదని, మొదట తామే చెబుతామన్నారు. రికార్డుల్లో అది ఉంటే హుందాతనంగానే ఉంటుందన్నారు.
అనంతరం... మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తమ వ్యాఖ్యలు ఎవరి మనసునైనా నొప్పించి ఉంచే ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు.
ఆ తర్వాత అరుణ మాట్లాడుతూ.. తాము మైకు విరగ్గొట్టినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. అయితే, నోరు మూసుకో అనే పదం పైన క్షమాపణ చెప్పాలని తెరాస సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై డీకే అరుణ ఘాటుగా స్పందించారు. మహిళలను గౌరవించే పద్ధతి తెరాస సభ్యులు నేర్చుకోవాలన్నారు. తాము భేషజాలకు పోవడం లేదన్నారు. ఎదుటి వ్యక్తులను రెచ్చగొట్టేలా తెరాస మాట్లాడుతోందన్నారు.
మీకు తల్లీ, చెల్లీ ఉన్నారని, వారిని గౌరవించడం నేర్చుకోవాలన్నారు. నోరు మూసుకో అనేపదం అన్ పార్లమెంటరీ అయితే.. రేపటి నుండి మిగతా సభ్యులకు కూడా దీనిని వర్తింప చేస్తే.. తాను క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. అనంతరం ఈ వాగ్వాదం ముగిసిపోయింది.












Click it and Unblock the Notifications