కల్తీ కల్లు దుకాణాల మూత: 9మంది మృతి, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు
హైదరాబాద్: కల్తీ కల్లు దొరకక 9 మంది మృతి చెందిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అధికారుల ఆదేశాలతో కల్తీ కల్లు దుకాణాలను మూసివేయడంతో... దానికి బానిసలైన వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కల్తీ కల్లు దొరక్క ఆదివారం తెలంగాణలో 9మంది మృతి చెందారు.
ఇందులో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు ఏడుగురు, అదిలాబాద్ జిల్లాకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. వందలాది మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. చాలామంది కల్తీ కల్లుకు బానిసైన విషయం తెలిసిందే.గత నాలుగు రోజులుగా కల్తీ కల్లు దొరకకపోవడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
మృతి చెందిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన అరవయ్యేళ్ల ఈసమ్మ మతి స్థిమితం కోల్పోయినట్లు వ్యవహరించడంతో శనివారం గద్వార ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

చికిత్స పొందుతూ అదివారం మృతి చెందింది. పులిమామిడికి చెందిన ఆశమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లి, మృతి చెందింది. గంగాపురంకు చెందిన నర్సింహులు పిచ్చిగా ప్రవర్తిస్తే ఆసుపత్రికి తీసుకెళ్లగా, మృతి చెందాడు. ఇలా తొమ్మిది మంది మృతి చెందారు.
కత్లీ కల్లు దొరకక పోవడంతో వింతగా ప్రవర్తిస్తూ కొంతమంది మూర్చతో అపస్మారక స్థితికి వెళ్లిపోతున్నారు. ఇలాంటి వారు ఆదివారం మెదక్ జిల్లా సంగారెడ్డి ఆసుపత్రిలో 17మంది చేరారు. మహబూబ్ నగర్ ఆసుపత్రిలో 30 మంది, జడ్చర్ల ఆసుపత్రిలో 16 మంది కల్తీ కల్లు బానిసలు చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications