త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా... సెలవిచ్చిన మంత్రి సీతక్క!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. 2025 జూలై మాసం పూర్తయ్యేసరికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. జులై చివరి వారానికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోందని త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తాజాగా వెల్లడించారు. ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వస్తుందన్న మంత్రి సీతక్క
తాజాగా మహబూబా బాద్ జిల్లా కొత్తగూడాలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆమె గ్రామాలలో సర్పంచులు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మంజూరు కావడం లేదని పేర్కొన్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయని మంత్రి సీతక్క వెల్లడించారు.

జులైలో ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ సర్కార్ సన్నాహాలు
జూలై మాసంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో పాలన పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను పొంది ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఈ ఎన్నికలు చాలా కీలకంగా భావిస్తున్నట్టు సమాచారం. దాదాపు 1500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేంద్రం ద్వారా స్థానిక సంస్థలకు నిధులు అందుతాయి.
ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
ఈ క్రమంలోనే వారం పది రోజుల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి సీతక్క ప్రకటించారు. ఇక ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితాలు తయారీ, పేపర్ల ముద్రణ , పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు వంటి ఎన్నికల ప్రక్రియలు అన్నింటిని పూర్తి చేసింది.
సమరానికి సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
తెలంగాణ రాష్ట్రంలో 12,815 గ్రామపంచాయతీలు, 1.14 లక్షల వార్డులు, 538 జడ్పిటిసి స్థానాలు, 5,817 ఎంపీటీసీ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల కోసం కర్ణాటక, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి 70 వేల బ్యాలెట్ బాక్సులను కూడా తెప్పించారు.మొత్తానికి త్వరలోనే ఎన్నికల నగారా మోగనున్న నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి.












Click it and Unblock the Notifications