రేవంత్ రెడ్డికి షాకిచ్చిన పోలీసులు..!!
Revanth Reddy: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే.

మహా వికాస్ అగాఢీ తరఫున ఎన్నికల ప్రచార బరిలో దిగారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో స్థిరపడిన జిల్లాల్లో ఆయన పర్యటిస్తోన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మహా వికాస్ అగాఢీ అభ్యర్థులతో కలిసి ముమ్మర ప్రచారం సాగించనున్నారు.
ఈ ఉదయం ఆయన నాగ్‌పూర్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి చంద్రాపూర్‌కు చేరుకున్నారు. చంద్రాపూర్ నుంచి తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం రజూరా, దిగ్రాస్, వార్ధాల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. రాత్రికి నాగ్‌పూర్‌కు తిరిగి వస్తారు. అక్కడే బస చేస్తారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఘుఘుస్‌కు కారులో బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డికి షాకిచ్చారు అక్కడి పోలీసులు, ఎన్నికల సిబ్బంది. ఆయన కారును ఆపివేసి, తనిఖీ చేపట్టారు. కారు వెనుక భాగంలో ఉంచిన బ్యాగ్‌లన్నీ క్షున్నంగా చెక్ చేశారు. కారు డాష్ బోర్డునూ తనిఖీ చేశారు.
ఆ సమయంలో రేవంత్ రెడ్డి కారులోనే ఉన్నారు. తనిఖీకి సహకరించారు. తనిఖీ ముగిసిన తరువాతే కారును అక్కడి నుంచి వెళ్లనిచ్చారు. ఈ రెండు రోజుల పాటు మహారాష్ట్రలోనే ఉండబోతోన్నారు రేవంత్ రెడ్డి. ఆదివారం ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్ నుంచి నాందెడ్‌కు బయలుదేరి వెళ్తారు రేవంత్ రెడ్డి. నయాగావ్, భొకార్, షోలాపూర్‌లల్లో ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications