మూసీలో దూకడానికి సిద్దమా?: కేటీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్
మూసీ నది డెవలప్‌మెంట్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మూసీ నది తీరంలో నిర్మించిన పలు నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఆ నివాసాల్లో ఉంటున్నవారికి డబుల్ బెడ్రూం ఇళ్లకు తరలిస్తోంది. మరికొందరికి పరిహారం ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే, ఈ మూసీ ప్రాజెక్టుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై డీపీఆర్ కూడా రెడీ కాకుండానే అవినీతి అంటూ కేటీఆర్ ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనలో ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా?.. మూసీపై ఉన్న పూరానాపూల్ బ్రిడ్జిపై చర్చిద్దామా? నేను మా మంత్రులతో వస్తా.. నువ్వు మీ పార్టీ వాళ్లతో వస్తావా? అంటూ కేటీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.

అవినీతి నిజమని తేలితే.. తాను మూసీ నదిలో దూకుతా.. లేదంటే నువ్వు దూకు అంటూ కేటీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. డీపీఆర్ కూడా రెడీకాక ముందే లక్షకోట్ల అవినీతి అంటూ దుష్ప్రచారం చేయడం ఏంటని కేటీఆర్ పై మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన తెరమీదకు తెచ్చింది.. 2016లో నగరాన్ని ఆదుకుంటా అన్నోడు కేసీఆర్ కాదా అని మహేశ్ కుమార్ ప్రశ్నించారు.
మూసీ, హైడ్రాతో రాహుల్ గాంధీకి లింక్ ఏంటని కేటీఆర్‌ను ప్రశ్నించారు. చెరువులను కుంటలను ప్రొటెక్ట్ చేయడమే హైడ్రా ముఖ్య టాస్క అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. 16 వందల చెరువులను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆక్రమణలకు యథేచ్చగా అనుమతులు ఇచ్చారన్నారు. ఆరు నెలలుగా మీ నాయన ఎక్కడ దాక్కున్నాడో తమకు అనుమానాలున్నాయి కేసీఆర్ గురించి కేటీఆర్‌ను ప్రశ్నించారు. కాగా, మూసీ ప్రక్షాళన పేరుతో లక్షా 50 వేల కోట్ల అవినీతికి తెరలేపారంటూ రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని వేలు, లక్షల ఎకరాలకు సాగునీరందిస్తారని నిలదీశారు.












Click it and Unblock the Notifications