తెలంగాణలో ఊపందుకున్న ఆ ఎయిర్ పోర్ట్ పనులు!
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు రెండో రాజధానిగా భావిస్తున్న వరంగల్ జిల్లాలోని మామునూర్ ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఎయిర్ పోర్ట్ ను ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళికను రూపొందించారు. తాజాగా ఈ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఎయిర్పోర్ట్ భూసేకరణలో జాప్యం జరగకూడదన్న ఎంపీ కడియం కావ్య
తాజాగా మామునూర్ ఎయిర్ పోర్టు రన్ వే విస్తరణకు సంబంధించి భూసేకరణను కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలసి పరిశీలించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. అధికారులతో కలిసి మామునూరు ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించిన ఎంపీ ఎయిర్పోర్ట్ భూసేకరణలో జాప్యం జరగకూడదని తెలిపారు.

ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే రోడ్లను పరిశీలించిన ఎంపీ
చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఓరుగల్లు ప్రజల విమానాశ్రయం కల త్వరలోనే నెరవేరబోతోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. నక్కల పల్లి చెరువు, గాడిపల్లి చెరువులతో పాటు ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే రోడ్లను సందర్శించి పరిశీలించారు. ప్రస్తుత వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని ఎయిర్పోర్ట్ పరిధిలో చేపట్టబోయే నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని ఎంపీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో విమానాశ్రయం పనులు
మామునూరు ఎయిర్పోర్ట్. భూ సేకరణకు సంబంధించిన పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు ఎంపీ సూచించారు. అనంతరం అధికారులు మ్యాప్ ద్వారా రన్ వే విస్తరణ పనులను ఎంపీకు వివరించారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మామునూరులో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు.
ఎయిర్ పోర్ట్ సర్వీసులు ప్రారంభమైతే వరంగల్ ప్రగతి
ప్రయాణికుల సేవలతో పాటు కార్గో సేవలను సైతం అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ను రాష్ట్ర రెండో రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పక్కనే ఉన్నందున ఎయిర్ పోర్ట్ సర్వీసులు ప్రారంభమైతే వరంగల్ ప్రగతిలో దూసుకుపోతుందన్నారు.












Click it and Unblock the Notifications