రోడ్డుపై కాలిన బైక్, వ్యక్తి సజీవ దహనం: భార్య కేసు పెట్టిందని టెక్కీ ఆత్మహత్య
నిజామాబాద్: బైక్, డీసీఎం ఢీకొని ఓ యువకుడు నడి రోడ్డు పైన సజీవ దహనమైన సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద జరిగింది. డీసీఎంను బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో రోడ్డుపై రాపిడి జరిగి పెట్రోల్ ట్యాంకు మూత ఎగిరిపోయింది. దీంతో మంటలు చెలరేగి బైక్‌పైనున్న భాస్కర్ అనే యువకుడు మృతి చెందాడు.
గురువారం సాయంత్రం ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద జాతీయ రహదారిపై మూల ములుపు వద్ద పెర్కిట్ వైపు నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న డీసీఎం మోర్తాడ్ నుంచి ఆర్మూర్‌కు వస్తున్న భాస్కర్ బైక్‌ను ఢీ కొట్టింది. వేగంగా వ్యాన్‌ను ఢీకొన్న బైక్ రోడ్డుపై కొద్దిదూరం రాపిడికి గురైంది.

బైక్ పెట్రోల్ ట్యాంకు మూత కిందపడింది. రాపిడితో తీవ్రమైన ఎండ కారణంగా మంటలు లేచాయి. భాస్కర్ శరీరం మీద బైక్ పడటంతో అతను మంటల నుంచి తప్పించుకునే వీలులేకపోవడంతో సజీవ దహనమయ్యాడు. సమాచారం అందించడంతో అగ్నిమాపక శకటం వచ్చి మంటలను ఆర్పింది.
మృతుడు భాస్కర్ ఓ ప్రయివేటు విత్తన కంపెనీలో పని చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. మోర్తాడ్‌లో మిత్రుడి ఎంగేజ్‌మెంటుకు హాజరయ్యేందుకు గురువారం ఉదయం వెళ్లాడు. అక్కడ భోజనం చేసి ఆర్మూర్‌కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. మృతదేహం గుర్తించలేనంతగా కాలిపోయింది. జేబులో లభించిన ఆధారలతో వివరాలు గుర్తించారు.
సాఫ్టువేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాదులో ఓ సాఫ్టువేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్మన్ ఘాట్‌లో నివసించే విజయ్ అనే సాఫ్టువేర్ ఉద్యోగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రాలేదన్న కారణంతో మనస్తాపం చెందిన అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. భార్య తన పైన కేసు పెట్టిందని కూడా అతను మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications