ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నం చేసిన తండ్రి
నల్లగొండ: నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలంలోని కొండమడుగుమెట్టు కేపాల్ సమీపంలో పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం సంచలనం సృష్టించింది.
సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వారాల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం బచ్చన్నగూడెంకు చెందిన కోయ క్రిష్ణారెడ్డి 20 సంవత్సరాల క్రితం అవుషాపూర్ గ్రామంలో నివాసం ఉంటూ కొండమడుగు కేపాల్ వద్ద హోటల్ నిర్వహిస్తున్నాడు. శనివారం తన కుమార్తె రవళి (11), నితీష్‌కుమార్ (8)లను స్వంత గ్రామమైన బచ్చన్నగూడెంలోగల 10 ఎకరాల భూమిని పిల్లల పేరుపై రిజిస్టర్ చేస్తానని భార్య సునీతకు చెప్పి, తన వెంట తీసుకుని వెళ్లాడు.

అయితే, ఎప్పటికీ రాకపోవడంతో భార్య సునీత ఫోన్ చేసినా కూడా స్పందించక పోవడంతో అనుమానం వచ్చి సోమవారం కుటుంబసభ్యులతో కలిసి హోటల్ షట్టర్‌ను తెరవగా ఇద్దరు పిల్లలు మృతి చెందగా క్రిష్ణారెడ్డి అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో క్రిష్ణారెడ్డిని ఘట్‌కేసర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనకు భూవివాదాలే కారణంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications