యాదాద్రిలో మంచు మనోజ్ దంపతుల ప్రత్యేక పూజ: ఉదారత చాటుకున్న లక్ష్మి
హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సినీనటుడు మంచు మనోజ్ దంపతులు, మంచు లక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యే క పూజలో పాల్గొన్నారు. భూమా మౌనికతో మనోజ్‌కు వివాహమైన తర్వాత యాదాద్రి ఆలయానికి రావాలని మొక్కుకున్నట్లు.. అందుకే వచ్చామని మంచు లక్ష్మి తెలిపారు.
యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మంచు మనోజ్ అన్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు మంచు లక్ష్మీ గొప్ప మనసు చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లక్ష్మీ, మనోజ్ దంపతులు.. కలెక్టర్ పమేలా సత్పత్తి, జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రైవేటు పాఠశాలలకు తగ్గట్టు స్మార్ట్ క్లాసెస్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభిస్తామని మంచు లక్ష్మి తెలిపారు. 1 నుంచి 5వ తరగతుల వరకు మూడేళ్ల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తామని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తమ టీచ్ ఫర్ ఛేంజ్ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాల్లో భాగంగా 56 స్కూళ్లలో 3వేల మందికిపైగా విద్యార్థులకు చదువు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. తమ సంస్థ ద్వారా లక్షలాది మంది విద్యార్థులు చదువుకునేలా కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. సతీసమేతంగా హాజరైన మనోజ్ దంపతులతో పాటు లక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన సీఎం కేసీఆర్ కు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు. ఆలయం అందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం మనోజ్ 'వాట్ ది ఫిష్' , 'మనం మనం బరంపురం' సినిమాలతో పాటు మరో సినిమా కూడా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications