కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్.. 22 మంది మావోయిస్టులు మృతి
దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు, హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయిస్టులను పట్టుకోవడమే టార్గెట్ గా 'ఆపరేషన్ కగార్' కొనసాగుతోంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), కోబ్రా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్... బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ కు చెందిన బలగాలు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలోని కర్రెగుట్టలను లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టాయి.
ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 22 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఈ కీలక ఆపరేషన్‌ను ఏడీజీ వివేకానంద సిన్హా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) రాకేశ్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర రాజ్ లు ఎప్పటికప్పుడు ఆపరేషన్ పురోగతిని సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలోని బలగాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆధునిక సాంకేతికతతో డ్రోన్లు, సిగ్నలింగ్ టవర్లు ద్వారా మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలు భూగర్భ బంకర్ల కోసం వెతుకులాట కొనసాగిస్తున్నాయి. మందుపాతరలు, IED బాంబులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications