Medaram Song 2026: మిలమిల మెరిసిందగో మేడారం జాతర
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తెలంగాణ సంస్కృతికి, గిరిజనుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. రెండు సంవత్సరాలకు ఒకసారి అరణ్య ప్రాంతమైన మేడారంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం అనేది ఒక అపూర్వ దృశ్యం. భక్తి, సంప్రదాయం, ప్రకృతి అన్నీ కలిసే ఈ జాతర ఇప్పుడు రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
అలాంటి మేడారం వైభవాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క స్వయంగా ఒక ప్రత్యేక అడుగు వేశారు. మేడారం జాతరను ఉద్దేశించి రూపొందించిన జానపద గీతాన్ని సీతక్క స్వయంగా పాడటం ఇప్పుడు రాజకీయ, సాంస్కృతిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక పాటగా కాకుండా, గిరిజన సంస్కృతిపై ఆమెకు ఉన్న అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా మారింది.

ఈ పాటలో సమ్మక్క-సారలమ్మ మహిమలు, గిరిజనుల ఆరాధన విధానం, అడవుల్లోని ఆధ్యాత్మిక వాతావరణం సహజంగా ప్రతిబింబించాయి. డప్పుల మోగుడు, జానపద రాగాలు, సంప్రదాయ నృత్యాలు పాటకు ప్రాణం పోశాయి. గిరిజన సమాజం నుంచి వచ్చిన నాయకురాలిగా సీతక్క స్వరం ఈ పాటకు ప్రత్యేక బలం చేకూర్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆజాద్ అందించిన సాహిత్యం, కళ్యాణ్ కీస్ సంగీతం మేడారం ఆత్మను పట్టుకునేలా ఉన్నాయి. సీతక్కతో పాటు గడ్డం సంతోష్, ఆజాద్ గళం కలవడంతో పాట మరింత హృద్యంగా మారింది. మను మైఖేల్ కొరియోగ్రఫీ ద్వారా గిరిజన జీవనశైలి, జాతర ఉత్సాహం తెరపై సహజంగా ఆవిష్కృతమయ్యాయి.
ఇదేం తొలిసారి కాదు
అయితే మంత్రి సీతక్క మేడారం పాటను పాడటం ఇదేం తొలిసారి కాదు. 2022లో, గతేడాది కూడా ఆమె పాట పాడారు. ఇక ఈ ఏడాది మిలిమిల మెరిసిందగో మేడారం జాతర అంటూ పాటను ఎత్తుకున్నారు. కళకళలాడిందిగా గిరిజనుల జాతర అంటూ తన స్వర మాధుర్యాన్ని తెలంగాణ ప్రజలకు అందించారు. స్పష్టమైన ఉచ్చరణతో పాటా ఆసాంతం వినసొంపుగా ఉంది. తెలంగాణ గిరిజనుల ఆశలను ప్రస్పుటంగా వివరించేలా సీతక్క చేసిన ప్రయత్నం అద్భుతం.
ప్రజా ఉద్యమమే..
సీతక్క జీవిత ప్రయాణమంతా ప్రజల కోసమే. దళంలో చేరి ప్రజా పోరాటం చేసినా.. రాజకీయాల్లో చేరి ప్రజలకోసం పోరాడినా.. మంత్రిగా తన మార్క్ పాలనును చూపించినా.. ఇప్పుడు సింగర్ గా మేడారంపై తనకున్న భక్తి చాటుకున్నా .. తన కంటూ ప్రత్యేకమైన స్థానం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ప్రజలతో నేరుగా మమేకమయ్యే ఏ మార్గాన్ని కూడా ఆమె చేజార్చుకోరు.
ప్రసంగాలకే పరిమితం కాకుండా..
సాధారణంగా రాజకీయ నాయకులు ప్రసంగాలకే పరిమితమవుతారు. కానీ మేడారం జాతరకు ప్రత్యేకంగా పాట పాడటం ద్వారా సీతక్క రాజకీయానికి అతీతంగా సంస్కృతిని, సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా గిరిజనుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రయత్నం ఉండటం ప్రశంసనీయమని పలువురు పేర్కొంటున్నారు.
ఇప్పటికే ప్రపంచ ఖ్యాతి పొందిన మేడారం జాతరకు ఈ పాట రూపంలో మరో ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. భక్తి, సంస్కృతి, సంగీతం మేళవించిన ఈ గీతం మేడారం వైభవాన్ని మరింత లోతుగా ప్రజల హృదయాల్లో నాటే ప్రయత్నంగా మారింది. రాబోయే జాతరకు ముందు విడుదలైన ఈ పాట భక్తుల్లో భావోద్వేగాన్ని పెంచుతూ, మేడారం మహిమను తరతరాలకు చాటిచెప్పే ఒక శక్తివంతమైన మాధ్యమంగా నిలుస్తోంది.
గతంలోనూ అనేక పాటలు
మేడారం ఖ్యాతిని వర్ణిస్తూ గతంలోనూ అనేక పాటలు వైరల్ గా మారిన సంగతి మనందరికి తెలిసిందే. అనేక సినిమా పాటల.. ముఖ్యంగా అందాల మా ఊరి అక్కా చెల్లెళ్లే.. సమ్మక్క- సారక్క పాట, మంగ్లీ కనకవ్వ పాడిన మేడారం జాతర పాటలు ఇప్పటికి సంచలనమే. ఇక ఆ కోవలో మంత్రి సీతక్క చేరారు.












Click it and Unblock the Notifications