మెడికో ప్రీతి తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ- ఓ తల్లిగా కడుపుకోత !!
సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన తెలంగాణ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులకు లేఖ రాశారు.
విజయవాడ: సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసిన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచెత్తింది. అయిదు రోజుల పాటు నిమ్స్‌లో చికిత్స పొందిన ఆమె ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. సైఫ్ అనే సీనియర్ మెడికల్ స్టూడెంట్.. కొద్దిరోజులుగా ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆవేదనతో ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

నిమ్స్ లో ఆధునిక చికిత్స..
అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆమె ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ..ఫలితం దక్కలేదు. ఆదివారం సాయంత్రం ఆమె మరణించినట్లు ప్రకటించారు.

స్పందించిన కవిత..
ఈ ఉదంతంపై అధికార భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రీతి మరణం.. తనను తీవ్రంగా కదిలించివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే- ఆమె ప్రీతి తల్లిదండ్రులు నరేందర్- శారదకు లేఖ రాశారు. ఓ తల్లిగా తనను ఆ ఘటన కలచివేసిందని పేర్కొన్నారు. ఓ ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయిందని అన్నారు.

కోలుకోవాలంటూ..
ప్రీతి కోలుకోవాలంటూ కోరుకున్న కోట్లాదిమందిలో తానూ ఒకరినని కవిత అన్నారు. ఎన్నో కష్టాలకు ఓర్చి, పీజీ వైద్య విద్యను అభ్యసిస్తోన్న ప్రీతికి ఇలా జరగడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. ఉన్నత చదువులు చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

కడుపుకోత..
ప్రీతి మరణంతో కడుపుకోతను అనుభవిస్తోన్న నరేందర్- శారదకు ఎంత ఓదార్పు ఇవ్వాళని ప్రయత్నిం చేసినా అది తక్కువే అవుతుందని కవిత అన్నారు. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి పరిస్థిితి రాకూడదని చెప్పారు. ప్రీతి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.

దోషులను వదిలి పెట్టం..
ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోదని కవిత స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. యావత్ రాష్ట్ర ప్రజలు ప్రీతి కుటుంబం వెంటే ఉందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.












Click it and Unblock the Notifications