మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ నివాసం ఇష్యూ.. జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక ఆదేశాలు
టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి సంబంధించిన ఇంటి నిర్మాణం ఇష్యూలో జిహెచ్ఎంసికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చిరంజీవికి చెందిన జూబ్లీహిల్స్ నివాసంలో చేపట్టిన పునరుద్ధరణ నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం ఇచ్చింది. ఇంటి పునరుద్ధరణలో భాగంగా తాము చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని చిరంజీవి జిహెచ్ఎంసి కి దాఖలు చేసిన దరఖాస్తులను పరిశీలించి, చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని హైకోర్టు ఆదేశించింది.
జీహెచ్ఎంసీ తీరుపై చిరంజీవి హైకోర్టులో పిటీషన్
మెగాస్టార్ చిరంజీవి తన జూబ్లీహిల్స్ నివాస పునరుద్ధరణలో భాగంగా రిటైన్ వాల్ నిర్మించారు. ఈ రిటైన్ వాల్ క్రమబద్దీకరణ కోసం 2025 జూన్ 5వ తేదీన జిహెచ్ఎంసి కి దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిహెచ్ఎంసి ఈ దరఖాస్తు విషయంలో ఏ విధంగాను స్పందించలేదు. తమ దరఖాస్తును పట్టించుకోని జిహెచ్ఎంసి తీరును సవాల్ చేస్తూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పునరుద్ధరణ నిర్మాణాలను క్రమబద్దీకరణకు చిరంజీవి తరపు న్యాయవాది వాదన
పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2002లోనే జి ప్లస్ టు ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన పునరుద్ధరణ పనులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగమేనని, ఈ నిర్మాణాలను పరిశీలించి క్రమబద్ధీకరించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక జిహెచ్ఎంసి తరఫున న్యాయవాది స్పందిస్తూ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్ పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన కోర్టుకు తెలిపారు.
జిహెచ్ఎంసి కి హైకోర్టు కీలక ఆదేశాలు
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జిహెచ్ఎంసి కి పిటిషనర్ దరఖాస్తు పైన చట్ట ప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను క్లోజ్ చేశారు. ఇక ఈ తీర్పుతో చిరంజీవి ఇంటి నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పైన జిహెచ్ఎంసి దృష్టి సారించనుంది. దీనిని వేగవంతం చేయనుంది. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా అధికారులు తుది నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది.
జీహెచ్ఎంసీ ఏం చేయబోతుందో
తన దరఖాస్తును పట్టించుకోవడంలేదని కోర్టు మెట్లు ఎక్కిన చిరంజీవి వ్యవహారంలో, ఆయన ఇంటి నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పై జిహెచ్ఎంసి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి నిర్మాణాలు క్రమబద్దీకరించమని దరఖాస్తు చేసినా పట్టించుకోని అధికారులు, సామాన్యుల సమస్యలు పరిష్కరిస్తారా ? అన్నది ఈ ఇష్యూలో జరుగుతున్న చర్చ.












Click it and Unblock the Notifications