Weather Report: తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాలు.. !
తెలంగాణలో వచ్చే రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే సెప్టెంబరు 20, 21 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. ఇక రాజధాని హైదరాబాద్ లో ఆకాశం మబ్బు పట్టి ఉంటుందని పేర్కొంది.
సెప్టెంబర్ 20 నగరంలో జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు తిరోగమనం బాట పట్టనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి 25 మధ్య రుతుపవనాలు తిరోగమనం కానున్నాయి. జూన్ 1న కేరళను తాకిన పవనాలు.. జులై8న దేశవ్యాప్తంగా విస్తరించాయి. అక్టోబర్ 15 నాటికి రుతుపవనాలు తిరిగి వెళ్లిపోతాయి. మొదటగా ఉత్తరాది నుంచి తిరోగమనం మొదలు అవుతుంది. ఈ నాలుగు నెలల రుతుపవనాల సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి దేశంలో 836.7 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు అంచనా వేస్తున్నారు.

ఈసారి రుతుపవనాల వల్ల మంచి వర్షపాతమే నమోదయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాకాలం భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ, ఏపీలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి. కృష్ణా బేసిన్ లో జూరాల, శ్రీశైలం, పులిచింతల, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ నిండిపోయాయి. ఇక గోదావరి బేసిన్ లో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టలు నిండాయి. ఇక హైదరాబాద్ విషయానికొస్తే హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కూడా నిండిపోయాయి. దీంతో ఈసారి నీటి సమస్య ఉండదని భావిస్తున్నారు.
వ్యవసాయంతో పాటు తాగు నీటికి ఎలాంటి ఇబ్బందని ఉండని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో నీటి సమస్య రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications