తెలంగాణకు ప్రతిష్టాత్మకం టి-హబ్: సందర్శించనున్న సత్య నాదెళ్ల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ఈ నెల 28న సందర్శిస్తారు. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టెక్నాలజీ కేంద్రమైన టీ హబ్‌లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సత్య నాదెళ్ల ముచ్చటిస్తారు.
నాలుగు రోజుల హైదరాబాద్ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత వర్గాలు, అధికారులతో సత్య నాదెళ్ల భేటీ కానున్నారు. టి-హబ్‌లో కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉన్న స్టార్టప్‌లకు చెందిన యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈనెల 28న టి-హబ్‌కు విచ్చేసి, అక్కడి స్టార్టప్ ప్రతినిధులను ఉద్దేశించి రెండు గంటలు ప్రసంగించనున్నారని తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. టి-హబ్ ప్రారంభోత్సవానికి ఆయన్ను రమ్మనమని కోరామన్నారు.

కానీ, రావడానికి వీలుపడదని, హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తానని చెప్పారని, అందుకు అనుగుణంగా ఇప్పుడు టి-హబ్‌ను సందర్శిస్తారన్నారు. భారత్ రానున్న ఆయన హైదరాబాద్‌లో మూడు రోజులు ఉండే అవకాశం ఉందన్నారు. కాగా, ప్రస్తుతం టి-హబ్‌లో 130 స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
సత్య నాదెళ్ల టి-హబ్‌ను సందర్శించి ప్రసంగిస్తే అంతర్జాతీయంగా టి-హబ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు లభించే వీలుంటుంది. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించడానికి ఉన్న అవకాశాలను కూడా సత్య నాదెళ్లతో తెలంగాణ ఐటీ ఉన్నతాధికారులు చర్చిస్తారు.












Click it and Unblock the Notifications