గవర్నర్ దృష్టి ఎప్పుడూ బీజేపీ వైపే; నోరు పారేసుకుంటే ఎలా: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ ప్రభుత్వం మధ్య చోటు చేసుకున్న ప్రోటోకాల్ రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తనను అవమానిస్తున్నారని, రాజ్ భవన్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ గవర్నర్ తమిళిసై పై తెలంగాణ మంత్రులు విరుచుకుపడుతున్నారు.

తమిళి సై పై విమర్శల వెల్లువ
నిన్నటికి నిన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో మాకేం పంచాయితీ లేదని, గవర్నర్ గవర్నర్ గా వ్యవహరిస్తే గౌరవం దక్కుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో గవర్నర్ నరసింహన్ తో రాని వివాదం, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించారు. ఆమె తనకు తానుగా ఊహించుకుంటే ఏమీ చేయలేమని, ఆమెను ఎవరూ అవమానించలేదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇక తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

20 నిమిషాల ముందు చెబితే ప్రోటోకాల్ పాటించడం కష్టం
ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉగాది రోజున గవర్నర్ యాదాద్రికి వెళ్లారని, 20 నిమిషాల ముందు చెబితే ప్రోటోకాల్ పాటించడం కష్టంగా ఉంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ అనవసరంగా నోరు పారేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ఆమె తన పరిధిలో ఉంటే అందరూ గౌరవిస్తారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ తన పరిధిని దాటి మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గవర్నర్ తమిళిసై ఎప్పుడు బీజేపీ వైపే చూస్తారు
రాజ్యాంగపరంగా ఏ విధంగా నడుచుకోవాలో అదేవిధంగా గవర్నర్ ఉండాలని, కానీ ఆమె బిజెపి నాయకురాలు లాగానే నడుచుకుంటున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ లే గవర్నర్లు గా వచ్చారని ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. గవర్నర్ తమిళిసై ఎప్పుడు బీజేపీ వైపే చూస్తారని ఆమె మాటలను ఎవరూ నమ్మే అవకాశం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ కి ఇచ్చే మర్యాద తప్పక ఇస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.

తమిళిసై అసెంబ్లీ రద్దు వ్యాఖ్యలను తప్పుబట్టిన ఇంద్రకరణ్ రెడ్డి
గవర్నర్, గవర్నర్ లాగా కాకుండా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీ కోసం పని చేసినట్లు ప్రవర్తిస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. తాను అసెంబ్లీని రద్దు చేసే దాన్ని అని తమిళిసై మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీని రద్దు చేసిన రామ్ లాల్ కు ఏం జరిగిందో తమిళిసై గుర్తు తెచ్చుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications