హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ దెబ్బకు.. మెట్రోలో ప్రయాణించిన మంత్రి
హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలోని రోడ్లు ఎక్కడికక్కడ చెరువులు, నదులను తలపిస్తున్నాయి. రద్దీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక గంట వర్షం పడితేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. అయితే ట్రాఫిక్ తిప్పలు మంత్రులు, ఉన్నతాధికారులకూ తప్పలేదు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. భారీగా ట్రాఫిక్ జామ్ కారణంగా తెలంగాణ మంత్రి మెట్రో ప్రయాణం చేసి గమ్య స్థానాన్ని చేరుకోవాల్సి వచ్చింది.
హైదరాబాద్ మహానగరంలో వారం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనదారులు గంటల కొద్దీ రోడ్లపై ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్నారు. అయితే కూకట్ పల్లిలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తమ కాన్వాయ్ లో బయల్దేరారు. కానీ భారీ ట్రాఫిక్ కారణంగా వారి వాహనాలు ముందుకు సాగలేదు. దీంతో కాన్వాయ్ వదిలి మెట్రో బాట పట్టారు. ఈ క్రమంలో ఎల్బీ నగర్ నుంచి KPHB వరకు తమ కాన్వాయ్ వదిలేసి మెట్రో రైల్లో ప్రయాణించారు.

ఈ ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులతో మాట్లాడి ప్రభుత్వ పథకాల గురించి.. ప్రజల అభిప్రాయాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు తగు చర్యలు తీసుకోవాలని మెట్రో వాసులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇక వర్షం కారణంగా నగరంలోని పలు ప్రధాన కూడళ్లు అయిన బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications