అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ వెంటా? రాబందుల్లా పీకుతున్న కాంగ్రెస్ వెంటా?: మంత్రి కేటీఆర్ సూటిప్రశ్న
తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు ములుగు జిల్లాలో పర్యటించారు. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 150 కోట్ల రూపాయల మేర జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ములుగు జిల్లా లో పాత కలెక్టరేట్ స్థానంలో 65 కోట్ల వ్యయంతో అన్ని వసతులతో కూడిన సమీకృత కలెక్టరేట్ సముదాయానికి శంకుస్ధాపన చేశారు.
38 కోట్ల 50 లక్షలతో జిల్లా పోలీస్ కార్యాలయం, 10 కోట్ల 4 లక్షల వ్యయంతో పోలీసుల నివాస భవన సముదాయానికి కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించి, ఆపై తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువు గట్లపై సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆపై ములుగులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ నేతల మాయమాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ములుగు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ వెంట ఉందామా? లేక ఆరు దశాబ్దాల పాటు రాబందుల్లా పీకుతున్న కాంగ్రెస్ పార్టీ వెంట ఉందామా? మీరే ఆలోచన చేయాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చత్తీస్ గడ్ లో ఇంటింటికీ త్రాగునీరు ఇచ్చే ముఖం లేదని, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నట్టు కేటీఆర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ములుగు లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధికి ఆటంకం లేకుండా, ఎక్కడ అభివృద్ధిని ఆపకుండా పని చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో కెసిఆర్ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఛత్తీస్ గడ్ లో 24 గంటల ఉచిత కరెంటు ఉందా? తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఎలా ఇస్తున్నామో మీరే ఆలోచించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్న మంత్రి కేటీఆర్ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ములుగు జిల్లాలోని 17 వేల ఎకరాలకు పోడు భూముల పట్టాలను అందజేయనున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications