పాప పరిహారం చేసుకోండి.. పీఎం మోడీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం!!
తెలంగాణ మంత్రి కేటీఆర్ భారత ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ అమృత కాల సమావేశాలలో ప్రధాని మోడీ తెలంగాణపై ఎందుకు విషం చిమ్మారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని చెప్పడం దారుణమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
తాము దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని , అటువంటి తెలంగాణను, తెలంగాణ ప్రజలను ప్రధాని మోడీ అవమానించారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధానికి తెలంగాణ ప్రజల శాపం తగలడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ కి తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా పాలమూరు గడ్డపై కాలు పెట్టే హక్కు లేదని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

తెలంగాణపై పగ పట్టినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్న ఆయన తెలంగాణపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు తప్పకుండా వివరణ ఇవ్వాలన్నారు. పాలమూరు రంగారెడ్డి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, పాలమూరు పచ్చబడుతుంటే బీజేపీ నేతల కళ్ళు మండుతున్నాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అయినా కృష్ణా జలాలలో వాటా ఎందుకు తేల్చలేదని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ నిలదీశారు. పాలమూరుకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికైనా పాప పరిహారం చేసుకోవాలని ఆయన సూచించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణా రాష్ట్రానికి ప్రధాని మోడీ ఎప్పుడు వచ్చినా ఖాళీ చేతులతోనే వస్తారన్నారు. ప్రధాని మోడీ కి వచ్చే ఎన్నికలలో కూడా డిపాజిట్లు గల్లంతవుతాయని, తెలంగాణలో ఈసారి 110స్థానాల్లోనూ ఈసారి డిపాజిట్లు గల్లంతు కావటం ఖాయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక తొమ్మిదిన్నర ఏళ్ల తర్వాత అయినా ప్రధాని మోడీ పాప పరిహారం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణాపై పగ బట్టాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications