ఖమ్మం రాజకీయాల్లో బిచ్చగాడివి, బచ్చావి నువ్వే.. పొంగులేటికి మంత్రి పువ్వాడ కౌంటర్
ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ పై తాను పోటీ చేసి గెలవటం కాదు, అతనిపై బచ్చాగాడ్ని పెట్టి గెలిపిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
ఖమ్మం రాజకీయాలలో పొంగులేటినే బచ్చా అని, తాను చేసిన అభివృద్ధి తనను గెలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. పొంగులేటి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని పేర్కొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ మారిన తర్వాత పొంగులేటికి కేసీఆర్ విలువ తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు.

తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఉన్న పొంగులేటి, పిట్టల దొర లాగ రోజుకొక మాట మాట్లాడుతున్నాడని, రోజుకో వేషం వేస్తున్నాడని పిట్టల దొర మాటలకు భయపడే రకం తాను కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.తనపై ఎవరిని నిలబెట్టినా తాను చేసిన అభివృద్ధి తనను గెలిపించి తీరుతుందన్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం అవుతావు అని మురిసి పోతున్నావా? నువ్వు సీఎం ఏంటయ్యా.. సీఎం కావాలి అని ఒక చరిత్ర కావాలి అంటూ విమర్శలు గుప్పించారు పువ్వాడ అజయ్ కుమార్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాల చిట్టా తన వద్ద ఉందని, ఎన్నో వేల కోట్లు పొంగులేటి అక్రమంగా సంపాదించాడని ఆరోపించారు. ఖమ్మం రాజకీయ చరిత్రలోనే పొంగులేటి అంత బిచ్చగాడిని తానెక్కడ చూడలేదన్నారు.
పొంగులేటి జిల్లాకు ఎంపీగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బు ఉంది అన్న మదంతో విఱ్ఱవీగుతున్నారు అని మండిపడ్డారు. నీ డబ్బు ఖమ్మం ప్రజలకు ఎడమ కాలు చెప్పుతో సమానం అంటూ పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లోనూ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచి పొంగులేటి నీచ రాజకీయాలు చేశారని మండిపడ్డారు.
నా మనుషులు ఎవరో మట్టి దందా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నావ్.. నిరూపించే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ఎన్నెస్పీ కెనాల్ పనులలో దోపిడీ చేసిన విషయం మర్చిపోయావా? అంటూ ప్రశ్నించిన పువ్వాడ అజయ్ కుమార్ నీ చేతిలో మోసపోయిన సబ్ కాంట్రాక్టర్లు ఖమ్మం వస్తున్నారు.. నువ్వు రేపు రా బిడ్డ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం రా బిడ్డ .. నీ సంగతి చూస్తానంటూ పువ్వాడ అజయ్ కుమార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications